‘గోల్డ్‌ స్మగ్లింగ్‌లో హైదరాబాద్‌ టాప్‌ 5లో ఉంది’

Customs Commissioner MRR Reddy Says Gold Seized At Green Channel - Sakshi

 కస్టమ్స్ కమిషనర్ ఎమ్‌ఆర్‌ఆర్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : గోల్డ్ స్మగ్లింగ్‌లో హైదరాబాద్ టాప్ 5లో ఉందని కస్టమ్స్ కమిషనర్ ఎమ్‌ఆర్‌ఆర్‌ రెడ్డి పేర్కొన్నారు. రెండురోజుల క్రితమే 3.3 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఓ వ్యక్తి బెల్ట్‌ రూపంలో బంగారాన్ని తరలిస్తుండగా గ్రీన్‌ ఛానల్‌ వద్ద పట్టుకున్నామని.. దీని విలువ దాదాపు కోటి రూపాయల కంటే ఎక్కువగానే ఉంటుందన్నారు. ఈ మధ్యకాలంలో ఇదే అతిపెద్ద కేసుగా చెప్పవచ్చని పేర్కొన్నారు. గతేడాది రూ. 12 కోట్ల విలువైన బంగరాన్ని పట్టుకోగా...ఈ ఏడాది రూ. 4 కోట్ల విలువ గల బంగారాన్ని సీజ్‌ చేశామన్నారు. ‘నిందితులు రకరకాల మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా  బంగారాన్ని పొడి చేసి..ఇన్నర్ పార్ట్స్ లో తరలిస్తున్న కేసులు కూడా ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రయాణికులకు ఆశ చూపి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు టాక్స్ ఎగ్గొట్టేందుకు బంగారం తరలిస్తూ పట్టుబడుతున్నారు. బంగారం తరలిస్తున్న దాని వెనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠా ఉందా అనే దానిపై విచారణ జరుగుతోంది’ అని వెల్లడించారు.

రూల్స్‌ పాటించాలి..
‘విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం విషయంలో తప్పక రూల్స్ పాటించాలి. కస్టమ్స్ బ్యాగేజ్ రూల్స్ ప్రకారం మగవారు 20 గ్రాములు, ఆడవారు 40 గ్రాముల బంగారాన్ని తీసుకురావచ్చు. ఎక్కువ మోతాదులో బంగారం తెస్తుంటే రెడ్ ఛానల్‌లో డిక్లేర్ చేసి.. 38 శాతం టాక్స్ కట్టి తీసుకువెళ్లొచ్చు. ఎయిర్ పోర్ట్‌లో స్మగ్లింగ్ చేస్తూ దొరికిన బంగారాన్ని సీజ్ చేస్తాము. రూ. 20 లక్షలకు మించి విలువైన బంగారంతో పట్టుబడితే అరెస్ట్ చేస్తాము’  అని ఎమ్‌ఆర్‌ఆర్‌ రెడ్డి పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top