
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు వేటినీ ఇప్పటివరకు టీఆర్‌ఎస్ అమలుచేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని చెప్పారు. ప్రజాస్వామిక హక్కులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. నిరసన తెలిపే హక్కును కూడా అంగీకరించడం లేదన్నారు. అనేక సమస్యలపై జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట బీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. రైతుబంధు పథకంతో సన్న, చిన్నకారు రైతులకంటే భూస్వాములకే ఎక్కువ మేలు జరుగుతోందన్నారు. పోడు సాగు చేస్తున్న గిరిజన రైతులపై దాడులు ఆపాలని, వారిని భూముల నుంచి తొలగించే కుట్రలను మానుకోవాలన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ఓటర్ల చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.