సామాజిక న్యాయానికి సమాధి కట్టిన కేసీఆర్‌

CPI State Secretary Srinivas Comments On KCR Govt - Sakshi

కాళోజీసెంటర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పరిమితమై సామాజిక న్యాయానికి సమాధి కట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. వరంగల్‌ శివనగర్‌లోని తమ్మెర భవన్‌లో సీపీఐ వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం టి.రహెల అధ్యక్షతన మంగళవారం జరిగింది. సమావేశానికి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దళిత, గిరిజన, బలహీన వర్గాల కోసం అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కేసీఆర్‌ ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు.

తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ద్రోహులను మంత్రులను చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటే అందుకు విరుద్ధంగా కేసీఆర్‌ పాలిస్తున్నారని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.వెంకట్రాములు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి నియంతృత్వ పాలన చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ప్రజలు ఐక్యం కావాలన్నారు.

వర్ధన్నపేట నియోజకవర్గ నూతన కమిటీ
అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నియోజకవర్గ కమిటీ కార్యదర్శిగా ఎలమకంటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా దామెర కృష్ణ, కమిటీ సభ్యులుగా పోతరాజు సారయ్య, మోతె లింగారెడ్డి, గోలి రాజిరెడ్డి, ఆరెల్లి రవి, మాలోతు శంకర్, మద్దెల ఎల్లేష్, టి.రహెలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో సీపీఐ రూరల్‌ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్, అర్బన్‌ జిల్లా సహాయ కార్యదర్శి పనాస ప్రసాద్, కార్యదర్శివర్గ సభ్యులు మేకల రవి, జిల్లా నాయకులు మోతె లింగారెడ్డి, గోలి రాజిరెడ్డి ఎలమకంటి శ్రీనివాస్, దామెర కృష్ణ, ఆరెల్లి రవి, మాలోతు శంకర్, బుస్స రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top