పదో తరగతి  విద్యార్థులకు మాస్కులు

Covid 19 Telangana: Free Masks Distributed To SSC Exams Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సంక్షేమ శాఖలు ఉపక్రమించాయి. గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థులకు మాస్క్‌లు పంపిణీ చేస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇప్పటికే వాటిని జిల్లా సంక్షేమ శాఖాధికారులకు పంపిణీ చేశాయి. వీటిని సంబంధిత అధికారులకు అందించి పిల్లలకు పంపిణీ చేశారు. 

లక్ష మందికి పంపిణీ.. 
ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్రంలో 1,750 సంక్షేమ వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. వీటి పరిధిలో దాదాపు 25 వేల మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 325 ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 20 వేల మంది విద్యార్థులుంటారు. గురుకుల సొసైటీల పరిధిలో 906 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో 622 పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉంది. వీటిలో దాదాపు 48 వేల మంది విద్యార్థులున్నారు.

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆయా పాఠశాలలు, హాస్టళ్లలో ఉన్నారు. వీరు నేటి నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశాక తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కరోనా బారిన పడకుండా మాస్కులను పంపిణీ చేశారు. పరీక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చాక చేతులు శుభ్రపర్చుకోవడానికి హ్యాండ్‌వాష్‌లు, సబ్బులు సైతం పంపిణీ చేశారు. మొత్తంగా లక్ష మంది విద్యార్థులకు పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top