
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’చిత్రంలో దగా.. దగా.. కుట్ర పాట విషయంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఈ పాటను సినిమాతోపాటు సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ నుంచి తొలగించాలని పిటిషనర్ కోరుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దగా.. దగా.. కుట్ర పాటలో ఏపీ సీఎం చంద్రబాబును కించపరిచేలా చూపుతున్నారని, ఈ పాటను సినిమా నుంచి, యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా సెన్సార్ బోర్డును ఆదేశించాలని కోరుతూ పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
దీనిపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ ఏపీకి చెందిన వ్యక్తి అయినప్పుడు, ప్రజాప్రయోజన వ్యా జ్యాన్ని తెలంగాణ హైకోర్టులో ఎలా దాఖలు చేస్తా రని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం దాఖలు చేసే నాటికి హైకోర్టు ఉమ్మడిగానే ఉందని, ఈ పాట ను హైదరాబాద్‌లో విడుదల చేశారని ఎమ్మెల్యే తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ చెప్పారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడు చేయడానికి సంబంధించిన పాట అని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచేలా ఉందని అన్నారు. చంద్రబాబును మోసకారిగా చూపుతున్నారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి బాబే కారణమన్నట్లు ఈ పాటలో చూపుతున్నారని తెలిపారు.