కబళించిన కేన్సర్‌

Couples Waiting For Helping Hands Cancer Treatment - Sakshi

మూడేళ్లుగా బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న సీత

వైద్యం చేయించలేని స్థితిలో నిరుపేద హమాలీ కుటుంబం

ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు

తల్లాడ: రెక్కాడితేనే డొక్కాడే కుటుంబం.. అయినా సాఫీగా సాగుతున్న సంసారం.. ఉన్నంతలోనే ఇద్దరు పిల్లలను గొప్పగా చూసుకునే దంపతులు.. ఎలాంటి చింత లేకుండా ఉన్న వారికి కేన్సర్‌ రూపంలో పెద్ద కష్టమే వచ్చింది. మూడేళ్ల క్రితం ఆ ఇంటి ఇల్లాలు ఈలప్రోలు సీతకు మాయదారి జబ్బు సోకింది. ఆమెకు చికిత్స చేయించేందుకు ఆ నిరుపేద కుటుంబం ఆర్థికంగా చితికిపోతోంది. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది.  

ఈలప్రోలు సీత, వీరభద్రం దంపతులు.. వీరి గ్రామం తల్లాడ మండలంలోని రంగంబంజర.. వీరభద్రం తల్లాడలో హమాలీగా పని చేస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త వీరభద్రంతో పాటు సీత కుల వృత్తి అయిన బట్టలు ఉతికి, కూలికి వెళ్లేది. కాయ కష్టం చేస్తూ సీత కుటుంబానికి ఆసరాగా ఉండేది. అయితే మూడేళ్ల క్రితం ఆమె కేన్సర్‌ బారిన పడింది. బ్రెయిన్‌ ట్యూమర్‌తో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆమెకు చికిత్స అందించడం కోసం వీరభద్రం తనకున్న అర ఎకరం భూమిని అమ్మాడు. మరో రూ.5 లక్షల వరకు అప్పులు చేసి వైద్యం చేయించాడు.. తలలో గడ్డలు రాగా ఆపరేషన్‌ చేయించాడు. అయితే ఆ ఆపరేషన్‌ విజయవంతం కాలేదు. ప్రస్తుతం సీత మంచానికి పరిమితమైంది.

కూర్చోలేక.. నిలబడలేక.. జీవచ్ఛవంలా మారింది. సీత ఆరోగ్యం రోజురోజకు క్షీణిస్తుండటంతో భర్త వీరభద్రం హమాలీ పని కూడా మానేసి ఇంటి వద్దే ఉంటూ ఆమెకు సపర్యలు చేస్తున్నాడు. పనికి పోకపోవడంతో సంపాదన లేక.. ఇల్లు గడవడంతోపాటు సీత వైద్యానికి వీరభద్రం నానా అవస్థలు పడుతున్నాడు. తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశాడు. ప్రతి నెలా సీత వైద్యం కోసం రూ.20 వేలకు పైగా ఖర్చు అవుతున్న పరిస్థితి. దీంతో వైద్యం చేయించే స్థోమత లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. దాతలు ముందుకొచ్చి ఆర్థికసాయం అందిస్తే తప్పా కుటుంబ పోషణ, వైద్యం చేయించే స్థితిలో అతడు లేడు. ప్రభుత్వం, దాతలు మానవతా దృక్పథంతో సహకరించాలని వీరభద్రం వేడుకుంటున్నారు.  

ఉన్నదంతా ఖర్చు చేశా
రోజు పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో నా భార్యకు కేన్సర్‌ సోకింది. ఉన్నదంతా అమ్మి వైద్యానికి ఖర్చు చేశా.. ఆమెను చూసుకోవడానికి పని కూడా మానేశా. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. మూడేళ్లలో రూ. 5లక్షలు అప్పు చేశా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దాతలు, ప్రభుత్వమే కరుణించాలి.- ఈలప్రోలు వీరభద్రం

సహాయం చేయదల్చుకున్న వారు
సంప్రదించాల్సిన నంబర్‌: 9989816405  
బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌: 109810100101786, వీరభద్రం, ఆంధ్రాబ్యాంక్,  IFCS Code : ANDB0001098

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top