దంపతుల ఆత్మహత్యాయత్నం | Couple commit suicide | Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్యాయత్నం

Jul 15 2014 3:21 AM | Updated on Jul 10 2019 7:55 PM

దంపతుల ఆత్మహత్యాయత్నం - Sakshi

దంపతుల ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో అద్దె ఇంట్లో ఉంటున్న గుండా నరసింహారావు, రాజ్యలక్ష్మి దంపతులు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు యత్నించారు.

దాచేపల్లి : గుంటూరు జిల్లా నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో అద్దె ఇంట్లో ఉంటున్న గుండా నరసింహారావు, రాజ్యలక్ష్మి దంపతులు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు యత్నించారు. మజా కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగడంతో అపస్మారకస్థితికి చేరిన వారిని సోమవారం ఉదయం ఆస్పత్రికి తరలించగా రాజ్యలక్ష్మి (50) మృతిచెందింది. నరసింహారావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన గుండా నరసింహారావు, రాజ్యలక్ష్మి దంపతులు రెండేళ్లుగా నారాయణపురంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
 
 వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు కావడంతో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. నరసింహారావు రెండేళ్లుగా దాచేపల్లికి సమీప భవ్య ఫిల్లింగ్‌స్టేషన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం యధావిధిగా విధులకు వెళ్లి ఇంటికి చేరుకున్నాడు. సోమవారం ఉదయాన్నే  హైదరాబాద్‌లో ఉంటున్న అల్లుడు భాస్కర్ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఆయన నరసింహారావు ఇంటిలోకి వెళ్లి చూడగా దంపతులిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే స్థానిక ప్రైవేటు వైద్యశాలకు 108లో తరలించగా రాజ్యలక్ష్మి చికిత్సపొందుతూ మృతిచెందింది. నరసింహారావు పరిస్థితి విషమంగా ఉండడంతో పిడుగురాళ్లలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ యాదాల కోటేశ్వరరావు అక్కడకు చేరుకుని రాజ్యలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం వారు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పరిశీలించారు.
 
 మజా కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని భార్యాభర్త తాగినట్లు గుర్తించారు. సంఘటనాస్థలంలో వారి సంతకాలతో అల్లుడు భాస్కర్‌కు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. ‘మా ఇద్దరి ఆరోగ్యాలు బాగోలేదు కాబట్టి మా మరణానికి మేమే బాధ్యులమని.. నేను ఏ విధమైనతప్పు చేయలేదని, ఎటువంటి డబ్బు నా సొంతానికి వాడుకోలేదని.. నన్ను నమ్మాలి’ అని ఆ లేఖలో రాసి ఉంది. ఈ మేరకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు నరసింహారావు చికిత్సపొందుతున్న వైద్యశాలకు వచ్చిన భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ అధికారులను అక్కడ ఉన్న వ్యక్తులు నిలదీయడంతో వారు జారుకున్నారు. ఇదిలా ఉండగా భవ్య ఫిల్లింగ్ స్టేషన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న నరసింహారావు లెక్కలు సక్రమంగా చూపిం చడం లేదని యాజమాన్యం ఫోన్ ద్వారా శనివారం ఎస్‌ఐ కోటేశ్వరావుకు తెలిపింది. ఫిల్లింగ్ స్టేషన్‌లో లెక్కల్లో తేడాలు ఉన్నమాట వాస్తవమేనని భవ్యసిమెంట్స్ ఫ్యాక్టరీ అధికారులు పేర్కొన్నారు.
 
 ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం ఒత్తిడి వల్లే..
 భవ్య ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం తీవ్రంగా ఒత్తిడి చేయడంవల్లే నరసింహారావుతోపాటు రాజ్యలక్ష్మి ఆత్యహత్యకు యత్నించారని వారి కుమారుడు నరేష్, అల్లుళ్లు భాస్కర్, ఆనంద్‌లు ఆరోపించారు. నరసింహారావు ఏవిధమైన తప్పిదం చేయకపోయినా, యాజమాన్యం తప్పుగా ఆలోచించి మానసికంగా పెట్టిన ఇబ్బంది వల్లే వారు పురుగుల మందు తాగారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేవని, ఫిల్లింగ్ స్టేషన్‌లోని డబ్బును సొంతానికి వాడుకున్నారనడంతో వాస్తవం లేదని వారు తెలిపారు. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement