కొను‘గోల’!  | Cotton Purchase Centers Should Be Established | Sakshi
Sakshi News home page

కొను‘గోల’! 

Nov 10 2018 11:31 AM | Updated on Apr 7 2019 3:47 PM

Cotton Purchase Centers Should Be Established - Sakshi

సాక్షి, కొడంగల్‌: నియోజకవర్గంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మోసపోతున్నారు. దళారులకు పత్తి విక్రయించి ధరలోనూ, తూకంలోనూ నష్టాలపాలవుతున్నారు. గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు.

 వికారాబాద్‌ జిల్లా మారిన తర్వాత కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారని ఇక్కడి రైతులు ఆశించారు. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత ఏడాది వికారాబాద్, పరిగి, తాండూరు పట్టణాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కొడంగల్‌ను మాత్రం విస్మరించారు. రైతులకు సరైన మార్కెట్‌ సౌకర్యం లేకపోవడం వల్ల ఆరుగాలం కష్టించి పండిన పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

 నియోజకవర్గంలోని నల్లరేగడి భూముల్లో పత్తి మంచి దిగుబడి వస్తుంది. ఇప్పటికే రైతులు పత్తిని ఏరుతున్నారు. నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో దిగుబడి అధికంగా ఉంటుంది. మార్కెటింగ్‌ అధికారులు ఈ ప్రాంతంలో కంది, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని మార్కెట్‌ యార్డులో రూ.3 కోట్ల వ్యయంతో గోదాం నిర్మించారు. ఈ గోదాంలో 5వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం ఉంది. ప్రభుత్వం ఈ గోదాములో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. 


సెంటర్‌ ఏర్పాటుచేయాలి 
మార్కెటింగ్‌ అధికారులు కొడంగల్‌లో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చే యాలి. ప్రభుత్వం పత్తిని కొంటే రైతులకు మేలవుతుంది. ధరలోనూ, తూకంలోనూ మోసం జరగదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది. కొడంగల్‌ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాం. మార్క్‌ఫెడ్, మార్కెటింగ్‌ అధికారులు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది.                         – బస్వరాజ్, పీఏసీఎస్‌ చైర్మన్, కొడంగల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement