కువైట్‌ టు హైదరాబాద్‌ 

Coronavirus Vande Bharat First Flight Landed At Shamshabad Airport - Sakshi

శంషాబాద్‌కు వందేభారత్‌ తొలి విమానం 

కువైట్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు 

ఎయిర్‌పోర్టులోనే థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు 

వెంటనే హోటల్‌ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలింపు 

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రప్పించేందుకు కేంద్రం ప్రారంభించిన వందేభారత్‌లో భాగంగా తొలి విమానం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో దిగింది. కువైట్‌లో చిక్కుకుపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం తరలించింది. అక్కడి నుంచి శనివారం రాత్రి 10.07 గంటలకు ఎయిరిండియా ఏఐ 988 విమానం 163 మంది ప్రయాణికులతో చేరుకుంది. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారున్నట్లు సమాచారం. 

ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన వలస కార్మికులు ఉన్నట్లు తెలిసింది. కాగా, ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు, కస్టమ్స్‌ తనిఖీలు చేపట్టిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 బస్సుల్లో క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. భౌతిక దూరం పాటించడంలో భాగంగా ఒక్కో బస్సులో 15 మంది ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్లారు. ప్రయాణికులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దగ్గరుండి పర్యవేక్షించారు.  
(చదవండి: సహజీవనం చేయాల్సిందే)

4 హోటళ్లు రెడీ.. 
విదేశాల నుంచి వచ్చే వారికి సొంత ఖర్చులతో హోటళ్లలో క్వారంన్‌టైన్‌ అవకాశం కల్పించిన నేపథ్యంలో కువైట్‌ నుంచి వచ్చిన వారి కోసం హైదరాబాద్‌లో నాలుగు హోటళ్లు సిద్ధం చేశారు. హైటెక్‌సిటీ సమీపంలోని షెరటాన్‌ హోటల్, గచ్చిబౌలిలోని రెడ్‌ ఫాక్స్‌ హోటల్‌ను ఎక్కువ చార్జీ కేటగిరీలో కేటాయించారు. ఇక్కడ ఒక్కొక్కరికి భోజనంతో కలుపుకొని రూ.30 వేలు (క్వారంటైన్‌ మొత్తానికి) చార్జీ చేస్తారు. రూ.15 వేల కేటగిరీ కింద కామత్‌ లింగాపూర్, కాచిగూడలోని ఫ్లాగ్‌షిప్‌ హోటళ్లను కేటాయించారు. 

ఆ తర్వాత వచ్చే వారికి కూడా ఇప్పటికే ఆయా హోటళ్లలో గదులు సిద్ధం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని హోటళ్లకు తరలించే బాధ్యతను పర్యాటక శాఖకు అప్పగించారు. ఇందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు తిప్పుతోంది. హోటళ్ల ఎంపిక, తదితర అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ అధికారుల కమిటీ పర్యవేక్షిస్తోంది. 

(చదవండి: ఇక పరీక్షల్లేకుండానే..!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top