వారికి పాజిటివ్‌ ఎలా వచ్చిందబ్బా?

Coronavirus infected those who are not in contact with Covid-19 Victims - Sakshi

కరోనా వైరస్‌ సంక్రమణపై కూపీ లాగుతున్న యంత్రాంగం 

మూలాలు లేకుండానే వైరస్‌ సోకడంతో తలనొప్పులు

అతనికి 70 ఏళ్లు. అనారోగ్యంగా ఉంటే చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇటీవల విదేశాల నుంచి రాకపోకలు సాగించలేదు. దాదాపు నెల రోజులుగా ఇంటికే పరిమితమైన యాకుత్‌పురాకు చెందిన ఈ వృద్ధుడికి కరోనా ఎలా సంక్రమించిందో అంతుపట్టడంలేదు. 

ఇది ఇంకో కేసు... పక్షవాతంతో మంచానికే పరిమితమైపోయిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. రెండు నెలలుగా కాలు కూడా బయటపెట్టని ఈ వ్యక్తికి వైరస్‌ సంక్రమించినట్లు తేలిన అనంతరం కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వారికి పాజిటివ్‌ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో బాధితుడికి వైరస్‌ ఎలా సంక్రమించిందనేది తేలక తలపట్టుకున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా విశ్వరూపం చూపుతున్న కరోనా మహమ్మారి గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దగ్గు, తుమ్ములు, జ్వరం లక్షణాలతో బయటపడే ఈ వైరస్‌.. ఇటీవల ఇలాంటి లక్షణాల్లేనివారికి కూడా సోకుతున్నట్లు పరీక్షల్లో తేలింది. పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబసభ్యులు లేదా సన్నిహితంగా మెలిగినవారు పరీక్షలు చేయించుకుంటేనే ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి.

తాజాగా కరోనా బాధితులతో సంబంధం లేని వారికీ వైరస్‌ సంక్రమిస్తున్నట్లు తేలింది. జంటనగరాల్లో ఈ తరహాలో 15 కేసుల వరకు నమోదు కావడంతో ప్రభుత్వానికి వైరస్‌ మూలాలు కనుగొనడం చిక్కుముడిగా మారింది. దీంతో ఈ మాయదారి వైరస్‌ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందిందనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే, మూలాలు లేకుండా కరోనా బారిన పడడంతో ఇంకెంతమందికి ఇలాంటి లక్షణాలున్నాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top