సరిపడా మాస్కులు, శానిటైజర్లు ఉన్నాయా?

Corona: CP Sajjanar Inquery Medical Shop Owners - Sakshi

మందుల కొరత ఉందా.. 

మెడికల్‌ దుకాణం యజమానితో మాట్లాడి..

ఆరా తీసిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

సాక్షి, షాద్‌నగర్‌ : ప్రజలు ఏ మందులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు? శానిటైజర్లు, మాసు్కల సరిపడా ఉన్నాయా? మందుల కొరత ఏమైనా ఉందా?  అంటూ సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ బుధవారం షాద్‌నగర్‌ పట్టణంలో మందుల దుకాణం యజమాన్ని పరిశీలించి ఆరా తీశారు. లాకౌడౌన్‌ సందర్భంగా షాద్‌నగర్‌లో పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన సీపీ సజ్జనార్‌ చౌరస్తా సమీపంలో ఉన్న మెడికల్‌ దుకాణాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా దుకాణం యజమాని మల్లికార్జున్‌తో సీపీ సజ్జనార్‌ కొద్ది సేపు మాట్లాడారు. మందులకు ఏమైనా కొరత ఉందా? ఎక్కువగా ప్రజలు ఏ మందులను కొనుగోలు చేస్తున్నారని దుకాణం యజమానిని ప్రశ్నించారు. ఇప్పటి వరకైతే ఎలాంటి మందుల కొరత లేదని, చాలా మంది శానిటైజర్లు, మాస్కులు కొనుగోలు చేస్తున్నారని దుకాణం  యజమాని  తెలిపారు. అదేవిధంగా సమీపంలో ఉన్న కిరాణం దుకాణంలోకి వెళ్ళి నిత్యావసర సరుకులు సరిపడా ఉన్నాయా, కొరత ఏమైనా ఉందా అన్న విషయాలను కిరాణం దుకాణం యజమానిని సజ్జనార్‌ అడిగి తెలుసుకున్నారు. (నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం? )

లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు  
లాక్‌డౌన్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటున్నామని  సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. ఈసందర్బంగా ఆయన షాద్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం చాలా పటిష్టమైన చర్యలు చేపట్టిందని అన్నారు. సైబరాబాద్‌ పరిధిలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సేవలు అందించేందుకు పోలీసులు 24 గంటలు పని చేస్తున్నారని అన్నారు. నిత్యావసర సరుకులు ఎవరైనా పంపిణీ చేయాలంటే విధిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అనవసరంగా ప్రజలు ఇళ్ళ నుండి బయటికి రావొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు కూడ నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు సైబరాబాద్‌ పరిధిలో 4వేల వాహనాలను సీజ్‌ చేసినట్లు, లక్షన్నర ట్రాఫిక్‌ ఉల్లంఘనల కేసులు కూడ నమోదు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని విధిగా పాటించాలని, తద్వార కరోనా మహమ్మారిని అరికట్టవచ్చని అన్నారు. ఈకార్యక్రమంలో శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్, శిక్షణ ఐపీఎస్‌ అధికారి రితిరాజ్‌  పాల్గొన్నారు. (పురుగుల మందుతో బోండాలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top