'నేనెక్కడికి పారిపోలేదు, ఫోన్ నెంబర్ తెలుసుగా' | conspiracy on stephen, says muthaiah | Sakshi
Sakshi News home page

నేనెక్కడికి పారిపోలేదు, ఫోన్ నెంబర్ తెలుసుగా'

Jun 1 2015 2:49 PM | Updated on Sep 3 2017 3:03 AM

'నేనెక్కడికి పారిపోలేదు, ఫోన్ నెంబర్ తెలుసుగా'

'నేనెక్కడికి పారిపోలేదు, ఫోన్ నెంబర్ తెలుసుగా'

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ను బలిపశువును చేశారని ఈ కేసులో ఎ4 నిందితుడిగా ఉన్న మత్తయ్య ఆరోపించారు.

హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ను బలిపశువును చేశారని ఈ కేసులో ఎ4 నిందితుడిగా ఉన్న మ్యాథ్యూ జరుసలేం అలియాస్ మత్తయ్య ఆరోపించారు. దళితుడైన స్టీఫెన్పై టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విషయంలో తాను ఎలాంటి మధ్యవర్తిత్వం నడపలేదని ఆయన తెలిపారు.  స్టీఫెన్ సన్ను భయపెట్టి, రేవంత్ రెడ్డిని పట్టివ్వాలని బెదిరించారని, ఆ కుట్రలో తమ ఎమ్మెల్యేను పావుగా చేశారని అన్నారు.

మరోవైపు తాను పరారీలో ఉన్నట్లు వచ్చిన వార్తలను మత్తయ్య తీవ్రంగా ఖండించారు. తాను అజ్ఞాతంలో లేనని,  పరారీలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, ఇంట్లోనే ఉన్నానని, తన ఫోన్ కూడా ఆన్లోనే ఉందన్నారు.  తన ఫోన్ నెంబర్ ఏసీబీ అధికారులకు తెలుసునని, అలాంటిది తనకు ఫోన్ చేసి మత్తయ్య ఎక్కడున్నావ్ అని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.  ఏసీబీ అధికారులకు తనను అడిగే దమ్ము, ధైర్యం లేదా అని అడిగారు.

దళిత క్రైస్తవ వ్యతిరేకి అయిన కేసీఆర్ కుట్రలో ఏసీబీ అధికారులు, పోలీసులు పావులుగా మారారని ఆరోపించారు.  అగ్రవర్ణ, అధికార దాహం ఉన్న కేసీఆర్ తనకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. తనను ముద్దాయిగా చేసి బలి చేస్తున్నారని మత్తయ్య మండిపడ్డారు. ప్రభుత్వం కుట్రను ప్రజలకు తెలిపేందుకు తాను శిక్షకు సైతం సిద్ధమన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రేవంత్ 50 లక్షల రూపాయలను స్టీఫెన్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement