ఇంత జరుగుతున్నా పట్టింపు లేదు! | Congress party is busy in the Lok Sabha election campaign and does not mind the state | Sakshi
Sakshi News home page

ఇంత జరుగుతున్నా పట్టింపు లేదు!

Apr 24 2019 3:24 AM | Updated on Apr 24 2019 3:24 AM

Congress party is busy in the Lok Sabha election campaign and does not mind the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పెద్దగా దృష్టి సారించడం లేదనే చర్చ జరుగుతోంది. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో పరాజయం పాలుకావడంతో రాష్ట్రంపై భారీ ఆశలను వదిలేసు కున్న అధిష్టానం పెద్దలు పార్టీ ఎమ్మెల్యేల వలసలపై తగిన కార్యాచరణ రూపొందించడంలోనూ, స్థానిక నాయకత్వానికి మార్గదర్శనం చేయడంలోనూ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.

పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకోవడాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేస్తామని చెప్పిన ఢిల్లీ పెద్దలు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయి రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ నేతలే వాపోతున్నారు. పార్టీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలను కోల్పోయినప్పటికీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు బాధ్యతారాహిత్యమనే చర్చ పార్టీ కేడర్‌లో జోరుగా జరుగుతుండటం గమనార్హం.  

ఢిల్లీలోనూ డీలా... 
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటున్న ఢిల్లీ పెద్దలు కూడా ఈ విష యంలో ఆగ్రహంతో ఉన్నట్లు పలువురు నేతలు చెబుతున్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా నష్టపోతామని తెలిసినా ఇక్కడి నాయకుల మాటను గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని, కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఇలా చేస్తారని తాము ఊహించలేదని వారు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్య నేత ఢిల్లీలోని రాహుల్‌ గాంధీ కోటరీ సభ్యుడిని కలిసినప్పుడు ఆయన పూర్తిస్థాయిలో నిర్వేదం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? మేం అనుకున్నదేంటి? అక్కడ జరుగుతు న్నదేంటి? అధికారం ఎలాగూ రాలేదు.

అధికారం ప్రజలిస్తే వస్తుంది. కానీ, పార్టీ గుర్తించి, గౌరవించి టికెట్లు కూడా ఇచ్చి గెలిపిస్తే ఇప్పుడు పార్టీ మీద భరోసా లేదంటూ వెళ్లిపోవడం ఏంటి? అసలు మీ నేతలు ఏం చేస్తున్నారు? ఎలాంటి వారికి టికెట్లు ఇప్పించారు? తెలంగాణలో పార్టీని ఎలా కాపాడుకోవాలనేది మాకు కూడా అంతుపట్టడం లేదు’ అని వ్యాఖ్యానించినట్టు గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఫలితాల అనంతరం గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు సాధించి, జాతీయ రాజకీయాల్లో పరువు నిలబడితే తప్ప తాము ఇప్పట్లో తెలంగాణపై దృష్టి సారించలేమని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం.

ఏదేదో చేస్తామన్నారు... 
కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడం ప్రారంభమై దాదాపు 2 నెలలు కావస్తోంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందు నుంచే ప్రారంభమైన ఈ వలసలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇంకా ఉంటాయనే చర్చ కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తొలుత ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు తాము పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అప్పుడు టీపీసీసీ నాయకత్వంతో పాటు ఢిల్లీ పెద్దలు కూడా స్పందించారు.

ఈ విషయాన్ని ఊరికే వదిలేది లేదని జాతీయ అంశం చేస్తామని చెప్పారు. ఇందుకు తగినట్టుగా రాష్ట్ర నాయకత్వం కూడా దేశంలోని అన్ని పార్టీలను కలసి విషయాన్ని వివరిస్తామని, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ను దోషిగా నిలబెడతామని అన్నారు. సీఈసీని కలుస్తామని, అవసరమైతే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కానీ, ఇటీవల కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీని తీసుకొచ్చి గవర్నర్‌ను కలవడం మినహా చేసిందేమీ లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement