రాజకీయ వే‘ఢీ!’

Congress Leaders Political Factions In Nizamabad - Sakshi

చిరకాల ప్రత్యర్థులైన తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ వర్గాల మధ్య మాట ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సీజన్‌ కావడంతో అది పతాక స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఎవరి ఆస్తి ఎంతో తేల్చుకోవడానికి బుధవారం బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. కానీ జిల్లాలో 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్నందున బహిరంగ చర్చలకు అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. 

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో గంప గోవర్ధన్, షబ్బీర్‌ అలీల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో అది మరింత ముదిరింది. గత నెల 30న కామారెడ్డి పట్టణంతో పాటు భిక్కనూరు మండల కేంద్రంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీలు తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను టార్గెట్‌ చేసి మాట్లాడారు. గంప గోవర్ధన్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు ఆస్తు లు సంపాదించాడంటూ విమర్శలు సంధించారు.

దీంతో గంప గోవర్ధన్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన నిజాయితీనే శంకిస్తారా అంటూ రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీలపై తీవ్ర విమర్శలు చేశారు. తాను రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తు లు, షబ్బీర్‌అలీ రాజకీయాల్లోకి రాకముం దు ఉన్న ఆస్తులు, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సమకూరిన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. దమ్ముంటే బుధవారం కామారెడ్డి గాంధీ గంజ్‌లోని గాంధీ విగ్రహం వద్దకు రావాల న్నారు. దీనిపై షబ్బీర్‌అలీ అనుచరులు స్పందించారు. ఇరు పార్టీల నాయకుల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు నడిచాయి. ఎన్నికల సమయంలో వెనకడుగు వేసేది లేదని ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. బుధవారం కామారెడ్డికి రావాలంటూ తమ క్యాడర్‌కు  సమాచారం అందించారు.
 
అనుమతి లేదంటున్న పోలీసులు.. 
ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంతో జిల్లా కేంద్రంలో రాజకీయం వేడెక్కింది. ఒకవేళ ఇరు పార్టీల నేతలు గాంధీ గంజ్‌కు చేరుకుంటే రచ్చరచ్చ అవుతుందని పోలీసు లు భావిస్తున్నారు. అందుకే అనుమతి లేదంటూ ప్రకటనలు జారీ చేశారు. జిల్లా లో ఎన్నికల కోడ్‌తోపాటు 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, చర్చలు జరపడానికి వీళ్లేదని ఎస్పీ శ్వేత స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయమై ఆయా పార్టీల ముఖ్య నేతలకు కూడా సమాచారాన్ని పంపించారు. ఈ నేపథ్యంలో బుధవారం కామారెడ్డిలో ఏం జరుగుతుందన్న అంశంపై ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top