‘కాంగ్రెస్ పార్టీ ఏమైనా నిషేధిత సంస్థనా’

Congress Leaders Meet Governor Tamilisai Soundararajan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం శాంతి భద్రతలను కాపాడాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ను కోరారు. కాంగ్రెస్పార్టీ చేపట్టిన శాంతి యాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌ నేతలు మంగళవారం సగవర్నర్‌ తమిళసైని కలిశారు. గాంధీభవన్‌లో 135వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను గాంధీభవన్‌కు రాకుండా అడ్డుకోవడం, అరెస్టులు చేయడంపై గవర్నర్‌కి  ఫిర్యాదు చేశారు. టీపీసీపీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌కాల్‌కు పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ సరైన సమాధానం ఇవ్వకుండా అనుచితంగా ప్రవర్తించడం వంటి అంశాలను గవర్నర్‌ తమిళసై దృష్టికి తీసుకువెళ్లారు.

అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతల పట్ల పోలీసుల ప్రవర్తనపై గవర్నర్‌కి ఫిర్యాదు చేశామని ఉత్తమ్‌ వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం శాంతి భద్రతలను కాపాడే ప్రత్యేక అధికారాలు గవర్నర్‌కి ఉన్నాయని ఆయన తెలిపారు. శాంతియుతంగా కాంగ్రెస్పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయని.. ‘సేవ్ ఇండియా సేవ్ కానిస్ట్యూషన్’ పేరుతో ర్యాలీకి అనుమతి అడిగామని ఉత్తమ్‌ వివరించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా.. మేము గాంధీభవన్ లోపలే వేడుకలు నిర్వహించామని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా నిషేధిత సంస్థనా? ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు.  

ఐపీఎస్ అంజనీకుమార్ ఆంధ్రా కేడర్ అధికారి అని.. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంజనీ కుమార్ ప్రవర్తనపై విచారణ జరపాలని గవర్నర్‌ను కోరినట్టు ఆయన వెల్లడించారు. విభజన అనంతరం అంజనీకుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని.. అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి పార్టీలు మార్పిస్తున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారని ఉత్తమ్‌ మండిపడ్డారు. ఎల్బీనగర్ నుంచి సరూర్‌నగర్ వరకు ఆర్ఎస్ఎస్‌ ర్యాలీకి, దారుసల్లామ్‌లో ఎంఐఎంకి అనుమతి ఎలా ఇచ్చారని ఉత్తమ్‌ సూటిగా ప్రశ్నించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు  కాంగ్రెస్‌నేతలు రేవంత్‌రెడ్డి షబ్బీర్ అలీ, సీతక్క, అంజన్ కుమార్, వీహెచ్ తదితరలు గవర్నర్‌తో సమావేశమయ్యారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top