
కారు..కాంగ్రెస్
అనూహ్యమైన ఫలితాలు ఇచ్చి జిల్లా ఓటరు చైతన్యాన్ని ప్రదర్శించాడు. కేవలం రెండు పార్టీలనే ఆమోదించి, మిగిలిన పార్టీలను పక్కన పెట్టేశాడు. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో ఒకటి కాంగ్రెస్‌కు, మరొకటి టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టిన ఓటరు..
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అనూహ్యమైన ఫలితాలు ఇచ్చి జిల్లా ఓటరు చైతన్యాన్ని ప్రదర్శించాడు. కేవలం రెండు పార్టీలనే ఆమోదించి, మిగిలిన పార్టీలను పక్కన పెట్టేశాడు. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో ఒకటి కాంగ్రెస్‌కు, మరొకటి టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టిన ఓటరు.. అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలోనూ సమన్యాయమే పాటించాడు. ఆరుచోట్ల కారెక్కి, మరో అయిదుచోట్ల హస్తానికి అభయమిచ్చాడు. కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐని ఒకచోట ఆదరించాడు.
మొత్తానికి తెలంగాణ కొత్త రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో విలక్షణమైన తీర్పే వచ్చింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతో కేవలం టీఆర్‌ఎస్‌ను మాత్రమే ఆదరించిన ఓటర్లు, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరుచోట్ల కాంగ్రెస్-సీపీఐ కూటమి పట్ల మొగ్గు చూపాడు. దీంతో జిల్లాను టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చెరి సగం పంచి ఇచ్చినట్లయింది. ఉత్కంఠగా కొనసాగిన ఓట్ల లెక్కింపు మొత్తానికి మూడు గంటలకల్లా విజేతలెవరో అధికారికంగా స్పష్టం చేసింది.
భువనగిరి ఎంపీ సీటుతో పాటు భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యే సీట్లు టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. కాగా, నల్లగొండ ఎంపీ సీటుతో పాటు నల్లగొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ ఎమ్మెల్యే సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. దేవరకొండ స్థానాన్ని కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ సొంతం చేసుకుంది. జిల్లాలో మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అత్యధికంగా 38,055 ఓట్ల విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఇదే పార్టీకి చెందిన నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం అత్యల్పంగా 2299 ఓట్ల మెజారిటీతో.. సూర్యాపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి జగదీష్‌రెడ్డి 2219 ఓట్ల తేడాతో బయటపడ్డారు.
ప్రభావం చూపిన స్వతంత్రులు
తమ పార్టీల నుంచి టికెట్లు రాక స్వతంత్రులుగా బరిలోకి దిగిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి చెందిన ముగ్గురు రెబల్స్ సహా ఓ ఇండిపెండెంటు అభ్యర్థి నాలుగు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచారు. భువనగిరి నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్, టీడీపీలను వెనక్కి నెట్టారు. ఆయనకు ఈ ఎన్నికల్లో 39,270 ఓట్లు పొందారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో 15,416 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పాల్వాయి స్రవ ంతి కూడా ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు.
ఆమెకు 27,441 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి టికెట్ దక్కించుకోలేక సూర్యాపేట నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్.దామోదర్‌రెడ్డిని వెనక్కి నెట్టివేసి రెండోస్థానంలో నిలిచారు. ఆయన 41,335 ఓట్లు పొందినా 2199 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి జగదీష్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. నల్లగొండ నుంచి టీడీపీ టికెట్ దక్కక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కంచర్ల భూపాల్‌రెడ్డి అనూహ్యమైన పోటీనే ఇచ్చారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ను మూడో స్థానంలోకి నెట్టివేసి 50,227 ఓట్లు సంపాదించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో 10,547ఓట్ల తేడాతో ఓడిపోయారు.
సీపీఐకి ఒకచోట మోదం.. మరోచోట ఖేదం
కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకున్న సీపీఐకి మిశ్రమ ఫలితమే వచ్చింది. గత ఎన్నికల్లో మహా కూటమిలో ఉన్న సీపీఐ దేవరకొండ, మునుగోడుల్లో పోటీ చేసి మునుగోడులో మాత్రమే గెలిచింది. ఈ సారి కాంగ్రెస్‌తో పొత్తు కుదరడంతో తిరిగి ఈ రెండు స్థానాల నుంచే పోటీ చేసింది. అయితే, మునుగోడులో కాంగ్రెస్ నాయకురాలు స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడడంతో ఇక్కడ సీపీఐ మూడో స్థానానికే పరిమితం అయింది. దేవరకొండలో మాత్రం సీపీఐ విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను ఈ సారి అదృష్టం వరించింది.