
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన క్రమంగా ఊపందుకుంటోంది. మొత్తం 1.78 కోట్లకుపైగా సర్వే నంబర్లలోని 2.4 కోట్ల ఎకరాల భూములకుగాను... 55 రోజుల తర్వాత 78 లక్షల సర్వే నంబర్లలోని కోటి ఎకరాల భూరికార్డుల పరిశీలన పూర్తయింది. డిసెంబర్ 31 నాటికి మరో కోటి సర్వే నంబర్లలోని 1.4 కోట్ల ఎకరాల భూరికార్డులను పరిశీలించాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు పరిశీలన పూర్తయిన కోటి ఎకరాల భూములకుగాను.. దాదాపు 35శాతం వరకు తప్పులను గుర్తించారు. ఇందులో 25 శాతం మేర సరిచేసేందుకు వీలైనవి. మిగతా 10 శాతం భూముల విషయంలో సంక్లిష్టత ఉందని.. వాటికి కొత్త సంవత్సరంలోనే పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
పెండింగ్ పడేది తక్కువే..
ప్రక్షాళనలో భాగంగా ఎలాంటి వివాదాలు లేకుండా వంద శాతం పరిష్కారమైన భూముల వివరాలను కేటగిరీ–ఏలో, అప్పటికప్పుడు పరిష్కారం కాని వాటిని కేటగిరీ–బీలో నమోదు చేస్తున్నారు. సరిచేయగలిగిన తప్పులను పరిష్కరించి కేటగిరీ–ఏలోకి మార్చుతున్నారు. ఇప్పటివరకు 78,57,855 సర్వే నంబర్లలోని 1,04,40,763 ఎకరాల విస్తీర్ణంలో రికార్డులను పరిశీలించగా.. 24,22,706 సర్వే నంబర్లలోని 36,96,147 ఎకరాల విస్తీర్ణంలో సవరణలు నమోదయ్యాయి. ఇందులో వెంటనే సరిచేయగలిగిన తప్పులను పరిష్కరిస్తూ వస్తున్నారు. మొత్తంగా భూరికార్డుల ప్రక్షాళన పూర్తయ్యేనాటికి 90 శాతం రికార్డులు సరిచేస్తామని.. మిగతా 10 శాతం రికార్డులను కొత్త సంవత్సరంలో అవసరమైతే సర్వే చేసి సరిచేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
వెనుకబడిన ఐదు జిల్లాలు.
భూరికార్డుల ప్రక్షాళన ఐదు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అందులో గద్వాల (25.3), భూపాలపల్లి (23.9), కొత్తగూడెం (32.3), వనపర్తి (35.8), సంగారెడ్డి (30.3) శాతం ప్రక్షాళనతో వెనుకంజలో ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో ఏకంగా 97.4 శాతం ప్రక్షాళన పూర్తయింది. కానీ ఈ జిల్లాలోనే అత్యధికంగా సవరణలు నమోదవుతున్నాయి.