రిజిస్ట్రేషన్‌తో పెళ్లికి చట్టబద్ధత

Collector Ramohan Said Those Who Married Register For Marriage To Be Legal - Sakshi

సాక్షి, ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): వివాహం చేసుకున్న వారంతా తప్పకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఆ పెళ్లికి చట్టబద్ధత లభిస్తుందని కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. అందుకే గ్రామపంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. వివాహ చట్టం–2002 అమలుకు సంబంధించి ఆయన బుధవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. వివాహం చేసుకునే వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, తద్వారా చట్టబద్ధత లభిస్తుందని తెలిపారు. వివాహ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు కలుగుతాయని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి పథకాలకు ఉపయోగపడుతుందన్నారు. బాల్య వివాహాలను అరికట్టవచ్చని, ఒక పెళ్లి తరువాత మరో పెళ్లి చేసుకునే వారిని గుర్తించి అడ్డుకోవచ్చని తెలిపారు. దంపతులు విడిపోతే భరణం పొందటానికి కీలకంగా మారుతుందని వివరించారు. ఒకవేళ తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే వారికి జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష పడుతుందన్నారు.

వివాహ చట్టం–2002 ప్రకారం గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్‌లో మున్సిపల్‌ కమిషనర్, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలకు వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రాలను, దరఖాస్తు ఫారాలను, రిజిస్టర్‌ను ప్రతి గ్రామ పంచాయతీకి పంపిస్తున్నట్లు చెప్పారు. వివాహాలు చేసుకున్న వివరాలు ఆ రిజిస్టర్‌లో నమోదు చేసి ప్రతి నెలా నివేదికలు పంపాలని అధికారులకు సూచించారు. పెళ్లి జరిగిన నెల రోజుల్లోగా దంపతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, నెల దాటి 60 రోజుల్లోగా రూ.100 ఫీజుతో రిజిస్ట్రేషన్‌ చేస్తారన్నారు. పెళ్లి సమయంలో కూడా రిజిస్టర్‌ చేయించడానికి ముందుగా సమాచారం అందిస్తే రిజిస్ట్రేషన్‌ అధికారి వచ్చి వివరాలు తీసుకుని రిజిస్టర్‌ చేస్తారని తెలిపారు. డీసీపీ ఉషా విశ్వనాథ్, ఐసీడీఎస్‌ అధికారిణి ఝాన్సీ, డీపీఓ జయసుధ, సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top