సర్కార్‌ బడిలో కలెక్టర్‌ పాఠాలు

Collector Lessons In Warangal Government school - Sakshi

 భూపాలపలి అర్బన్‌: తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉచితంగా ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్యను పొందాలని కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు సూంచించారు. కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి భూపాలపల్లి మండలంలోని ఎస్‌ఎం కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి 4, 8, 10 వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు.

8వ తరగతి విద్యార్థులకు సైన్స్, ఇంగ్లిష్, లెక్కల పాఠాలను, 10వ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలను బోధించి విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం వరకు ప్రైవేట్‌ పాఠశాలలో చదివి ఇటీవల 8వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థిని ఇక్కడి విద్యార్థుల కన్నా చదువులో వెనుకబడి ఉండడాన్ని కలెక్టర్‌ గుర్తించారు. దీంతో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు బడుల్లో మంచి విద్యను అందిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అపోహలకు గురవుతున్నారని, దానికి నిదర్శనం ప్రస్తుతం చూస్తున్నామన్నారు.

అనంతరం మధ్యాహ్న భోజనంను రుచి చూసిన కలెక్టర్‌ వంటలు బాగా చేశారని ప్రతిరోజు ఇలాగే విద్యార్థులకు రుచికరమైన భోజనం అందిచాలన్నారు. ఎస్‌ఎం కొత్తపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటానికి వంటగ్యాస్‌ సిలిండర్లను అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకొవాలన్నారు.

పదో  తరగతిలో సాంఘికశాస్త్రంలో విద్యార్థులు చురుగ్గా సమాధానాలు చెప్పడంతో ఆ సజ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు కోటిలింగంను అభినందించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు రజిత తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top