నాన్నతో సర్కార్‌ ఆసుపత్రికి

Collector Karnan Father Treatment in govt hospital - Sakshi

తండ్రి విరిగిన చేయికి చికిత్స చేయిస్తున్న కలెక్టర్‌

ఆర్భాటం లేకుండా మూడు రోజులుగా ఆసుపత్రికి.. 

విరిగిన చేయికి నేడు ఆపరేషన్‌ 

 ‘సాక్షి’ కంటికి చిక్కిన దృశ్యం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార హడావుడి లేదు. ఎలాంటి హంగామా లేదు. కారు నుంచి దిగిన ఓ వ్యక్తి తన తండ్రిని తీసుకొని అత్యంత సాధారణంగా సర్కారు దవాఖానకు వెళ్లారు. అప్పటికే విరిగిన చేతికి పట్టీ కట్టి ఉండడంతో అవసరమైన పరీక్షలు, ఇతర సేవలకు సంబంధించి డాక్టర్లతో మాట్లాడి కలెక్టరేట్‌లో జరిగే సమావేశం కోసం కారెక్కి వెళ్లిపోయారు. డాక్టర్, ఇతర సిబ్బంది చేయి విరిగిన వ్యక్తిని పరీక్షల కోసం ల్యాబ్‌కు తీసుకెళ్లారు. ఇది మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద మంగళవారం ‘సాక్షి’ కంటికి చిక్కిన దృశ్యం. 

కారులో తండ్రితో కలిసి వచ్చిన వ్యక్తి... మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆర్‌వీ.కర్ణన్‌. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుదలలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి అభినందనలు అందుకొన్న కర్ణన్‌ ఇప్పుడు స్వయంగా ఆచరించి చూపారు.  మారుమూల గ్రామాల ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేలా చేయడమే కాదు... తనే స్వయంగా తన తండ్రిని మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కలెక్టర్‌ కర్ణన్‌ తన తండ్రి వీరరాఘవన్‌ను ఆసుపత్రికి తీసుకొస్తూ మంగళవారం ‘సాక్షి’ కంట పడినప్పటికీ... ఆదివారం నుంచి మూడు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు తీసుకొస్తూ ఆర్థో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ అరవింద్‌ వద్ద చికిత్స చేయిస్తున్నారు. 

తండ్రి చేయికి ఫ్యాక్షర్‌ కావడం...
తమిళనాడులో నివసించే కలెక్టర్‌ కర్ణన్‌ తండ్రి వీరరాఘవన్‌ ఇంట్లో కింద పడడంతో చేయి ఎముక విరిగినట్లయింది. ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్‌ ఆయనను మంచిర్యాలకు రప్పించారు. గత ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆర్థో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ అరవింద్‌కు చూపించారు. చేయి ఎముక తొలగినట్లు (డిస్‌లొకేట్‌) అయినట్లు తేలడంతో చేతికి సిమెంట్‌ పట్టీ వేసి పంపించారు. సోమ, మంగళవారాలు కూడా కలెక్టరే స్వయంగా తండ్రిని తీసుకొని ఆసుపత్రికి వచ్చినట్లు డాక్టర్‌ అరవింద్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. బుధవారం చేతికి శస్త్రచికిత్స జరుపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తన తండ్రికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్న విషయాన్ని కూడా కలెక్టర్‌ గోప్యంగానే ఉంచడం గమనార్హం. తండ్రికి సేవ చేయడం తన విధి తప్ప ప్రచారం కాదు... అనే ధోరణిలోనే ఆయన వ్యవహారశైలి కనిపించింది. ఫొటో తీయడానికి కూడా కలెక్టర్‌ ఒప్పుకోలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top