మెదక్‌లో బడికి బరోసా.. | Sakshi
Sakshi News home page

మెదక్‌లో బడికి బరోసా..

Published Fri, Oct 18 2019 10:22 AM

Collector Implementing Strategic Plan For School Development - Sakshi

సాక్షి, మెదక్‌: ‘మన పల్లె బడి.. మన ధర్మ నిధి’ లక్ష్యం నెరవేరేలా కలెక్టర్‌  పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ట్రస్ట్‌కు విరాళాల సేకరణ.. పాఠశాలల్లో సమస్యల గుర్తింపు, పరిష్కారానికి సంబంధించి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీతోపాటు జిల్లా స్థాయి నిర్వహణ ఏజెన్సీకి రూపకల్పన చేశారు. జిల్లా కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్‌ చైర్మన్లుగా జేసీ, ఎస్పీ వ్యవహరించనున్నారు.

మండల కమిటీలకు ఎంఈఓ చైర్మన్‌గా, ముగ్గురు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ముగ్గురు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు లేదా ధర్మదాతల సభ్యులుగా.. గ్రామ కమిటీల్లో ప్రధానోపాధ్యాయుడు, వీఆర్వో, వీఆర్‌ఏ, ఉపాధ్యాయుడు కమిటీల్లో సభ్యులుగా ఉండనున్నారు.

ఈ కమిటీల బాధ్యతలు ఏమిటి.. ఏం చేయాలి.. ఎవరు ఎన్నారైల వివరాలు సేకరించాలి.. ఎవరు మాట్లాడాలి.. వంటి అంశాలపై కూడా సంస్థ విధివిధానాల్లో పొందుపరిచారు. జిల్లా స్థాయి నిర్వహణ ఏజెన్సీ జిల్లా కమిటీ చైర్మన్‌ అయిన కలెక్టర్‌ ఆదేశా మేరకు నడవాల్సి ఉంటుంది.

పక్కాగా బైలా.. రిజిస్ట్రేషన్‌
ట్రస్ట్‌కు సంబంధించి అవకతవకలకు చోటు లేకుండా పక్కాగా బైలా రూపొందించారు. ఇందుకు సంబంధించి కలెక్టర్‌ ధర్మారెడ్డి,  డీఈఓ రవికాంతరావు, నోడల్‌ ఆఫీసర్‌ సూర్యప్రకాష్, మరో ఇద్దరు ఉపాధ్యాయులు సాయికుమార్, రమేష్‌ చౌదరి కలిసి దాదాపు 15 రోజులు శ్రమించి  ట్రస్టుకు సంబంధించి విధివిధానాలు రూపొందించారు.

ఎవరైతే కలెక్టర్‌గా ఉంటారో వారే ఈ ట్రస్టుకు బాధ్యత వహిస్తారు. సంస్థ చిరునామాగా సమీకృత కలెక్టరేట్‌ సముదాయం, కలెక్టరేట్‌ కార్యాలయం, మెదక్‌ – 502110గా పేర్కొన్నారు. విరాళాలు అందించే వారితోపాటు విరాళాల మొత్తం, ఖర్చు వివరాలను వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

సమస్యల గుర్తింపు.. దశల వారీగా పరిష్కారం
గ్రామ, మండల కమిటీలు ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు గుర్తించి జిల్లా కమిటీకి పంపాలి. ప్రాధాన్యతా క్రమంలో ఆ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కమిటీ చర్యలు తీసుకుంటుంది. మొత్తం ఐదు దశల్లో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా అధికారులు ప్లాన్‌ రూపొందించారు. మొదటి దశలో పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మతులతోపాటు భవనాలకు పాఠ్యాంశ చిత్రపటాలతో ఆకర్షణీయమైన రంగులు వేయనున్నారు.

రెండో దశలో అన్ని పాఠశాలల్లో తాగు నీటి ఫిల్టర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. మూడో దశలో మండల స్థాయి నివేదికలకు పరిష్కారం చూపనున్నారు. నాలుగో దశలో గ్రంథాలయాలు, సైన్స్‌ ల్యాబ్‌ నరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ఐదో దశలో డిజిటల్‌ బోధన పరికరాలు, ఈ–లెర్నింగ్, ఆట వస్తువులు సమకూర్చడంతోపాటు బాలికల ఆత్మ రక్షణకు కరాటే శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

ఇప్పటివరకు రూ.కోటి..
గత నెల 25న మెదక్‌ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో విద్యా శాఖలో నెలకొన్న సమస్యలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి ‘మన పల్లె బడి.. మన ధర్మ నిధి’ లక్ష్యం వివరాలు వెల్లడించారు. తనవంతు వాటాగా రూ.25 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు.

మంత్రి హరీశ్‌రావు తన వేతనంలో నుంచి రూ.లక్ష ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఇతర ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సుమారు 4 వేల వరకు ఉండగా.. వారు ఒక రోజు వేతనాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దాదాపు రూ.65 లక్షలు ట్రస్ట్‌ ఖాతాలో త్వరలో జమకానున్నాయి. మొత్తానికి ఇప్పటివరకు సుమారు రూ.కోటి సేకరించినట్లు సమాచారం. 

Advertisement
Advertisement