నేడు గజ్వేల్‌లో ‘హరితహారం’

CM KCR To Launch 4th Phase Of Haritha Haram In Gajwel - Sakshi

ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

లక్షా నూట పదహారు మొక్కలు నాటే లక్ష్యం 

 కదంబం మొక్క నాటి సైరన్‌ మోగించనున్న సీఎం

 ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌/గజ్వేల్‌ :  హరితహారం నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం గజ్వేల్‌లో మొక్కలు నాటనున్నారు. గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఒకేరోజు లక్షా నూట పదహారు మొక్కలు నాటాలని నిర్ణయించారు. ములుగు సమీపంలో రాజీవ్‌ రహదారిపై ఒకటి, ప్రజ్ఞాపూర్‌ చౌరస్తాకు సమీపంలో మరొకటి, ఇందిరాచౌక్‌ దగ్గర ఇంకొకటి మొత్తం మూడు మొక్కలను సీఎం నాటుతారు. గజ్వేల్‌ పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో, రోడ్లపై, ఔటర్‌రింగ్‌ రోడ్డుపై, ప్రభుత్వ–ప్రైవేటు విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్‌ గజ్వేల్‌కు చేరుకుని ఇందిపార్కు చౌరస్తాలో ‘కదంబ’మొక్క నాటడంతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అన్ని ప్రార్థనా మందిరాల్లో సైరన్‌ మోగిస్తారు. ఆ తర్వాత ప్రజ్ఞాపూర్‌లో వినాయక ఆలయం ముందు ఉన్న నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో ఓ మొక్క నాటుతారని సమాచారం. సైరన్‌ మోగిన వెంటనే మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో ఏకకాలంలో ప్రజలు మొక్కలు నాటుతారు.  

ఏర్పాట్లు పూర్తి.. 
పండ్లు, పూల మొక్కలతో పాటు ఇళ్లలో పెంచేందుకు చింత, మామిడి, నేరేడు, కరివేపాకు, మునగ మొక్కలను వివిధ ప్రాంతాల నర్సరీల నుంచి తెప్పించారు. దాదాపు 1.25 లక్షల మొక్కలను ములుగు, గజ్వేల్‌ నర్సరీలతో పాటు కల్పకవనం అర్బన్‌ పార్కుల్లో అందుబాటులో ఉంచారు. ఇక్కడి నుంచి మొక్కలను పట్టణంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. పట్టణాన్ని 8 క్లస్టర్లుగా విభజించి, ప్రత్యేక అధికారులను నియమించారు. ఒక్కోక్లస్టర్‌లో 15 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొక్కలు నాటేందుకు వీలుగా మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 1.25 లక్షల గుంత లను తవ్వించారు.

సుమారు 75 వేల పండ్ల మొక్కలు (కొబ్బరి, జామ, దానిమ్మ, మామిడి, నేరేడు), 16 వేల పూల మొక్కలు, 10 వేల అటవీ జాతులకు చెందిన మొక్కలను సిద్ధం చేశారు. ఆకర్షణీయమైన చెట్లతో పాటు, ఇంట్లో రోజూ ఉపయోగపడే కరివేపాకు, మునగ లాంటి మొక్కలు, ఇళ్లలోని ఖాళీ స్థలాల్లో పెంచుకునే పూలు, పండ్ల మొక్కలను కూడా ఇంటింటికీ సరఫరా చేశారు. మొక్కల రక్షణ కోసం సుమారు 60 వేల ట్రీగార్డులను కూడా అధికారులు సిద్ధం చేశారు. మొక్కలు నాటిన తర్వాత వర్షాలు సరిగా పడకపోతే నీటిసౌకర్యం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు. కాగా, గజ్వేల్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. గజ్వేల్‌ మున్సిపాలిటీ, అర్బన్‌ ఫారెస్ట్‌ ఏరియాల్లో కలిపి మొత్తం 1.36 లక్షల మొక్కలు నాటాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
 
799 ప్రాంతాల్లో కంటి వెలుగు..
ఆగస్టు 15న మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా 799 ప్రాంతాల్లో ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని, ప్రతి కేంద్రంలో కూడా కచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కంటి పరీక్షలు చేయడానికి అవసరమైన సిబ్బంది, పరికరాలు, మందులు, అద్దాలను గ్రామాలకు చేర్చాలని చెప్పారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top