ఆ ఘటనపై కేసీఆర్‌ కలత చెందారు..

CM KCR Has Upset With the Incident Of Minor Girl Commited Suicide In Warangal - Sakshi

సాక్షి, భీమారం(వరంగల్‌) : జిల్లా కేంద్రంలోని సమ్మయ్యనగర్‌లో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్‌రావు కలత చెందారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సామూహిక లైంగిక దాడికి గరై అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబాన్ని సోమవారం మంత్రి దయాకర్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఘటన వివరాలను మృతురాలి నాన్నమ్మ లక్ష్మి వివరించింది. తండ్రి లేని పిల్లలను కష్టపడి చదివిస్తుండగా.. ఇలాంటి దారుణం జరిగిందని రోదించింది. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ ఘటనపై ముఖ్యమంత్రి చాలా బాధపడుతున్నారని తెలిపారు. స్వయంగా కేసు పరిశోధనపై ఆరా తీస్తున్నారని తెలిపారు. చిన్నారి శ్రీహిత హత్య కేసులో మాదిరిగానే ఈ కేసులోనూ నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసుల దర్యాప్తు ఉంటుందని పేర్కొన్నారు.

‘షీ’టీంలను బలోపేతం చేస్తాం
బాలికలు, యువతులు, మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన షీ టీంలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి దయాకర్‌రావు చెప్పారు. మహిళలకు సంబంధించి కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటుచేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల భద్రత కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మహిళలపై దాడులు జరిగితే రాజకీయం చేసే బదులు కుటుంబాలకు అండగా నిలవాలని హితవు పలికారు. అనంతరం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ వెన్నెల కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లు సిరంగి సునీల్‌కుమార్, స్వప్నతో పాటు స్థానికులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top