రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పర్యటన పై ఎన్నో ఆశలు..
కేవలం పవర్‌ప్లాంటుకే పరిమితం
మీడియాకూ దూరంగానే..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా వాసులకు నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి జిల్లాకు వచ్చిన కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపిస్తారని భావించారు. కానీ.. గురువారం ఆయన పర్యటన కేవలం జైపూర్ విద్యుదుత్పత్తి కేంద్రానికే పరిమితమైంది. జిల్లా ప్రగతి గురించి గానీ, జిల్లాలో నెలకొన్న ప్రధా న సమస్యలను గానీ ప్రస్తావించలేదు.
మధ్యాహ్నం ఒంటి గంటకు పవర్‌ప్లాంటు కు చేరుకున్న సీఎం సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్ ప్లాంటులోనే గడిపారు. సింగరేణి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పలువురు మంత్రులతో కలిసి రెండు హెలిక్యాప్టర్లలో వచ్చిన సీఎంకు జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ఎం.జగన్మోహన్ తదితరులు ఘనస్వాగతం పలికారు. సుమారు గంటపాటు విద్యుత్ ప్లాంటు నిర్మాణం పనులను పరిశీలించారు. ప్లాంటులోని వివిధ విభాగాలను చూశారు. ప్లాంటు వద్దే అక్కడే బీహెచ్ ఈఎల్, సింగరేణి, ఎన్టీపీసీల ఉన్నతాధికారులతో పనుల ప్రగతిపై సమీక్షించారు.
సుమారు మూడున్నర గంటలపాటు ఈ ప్లాంటులో గడిపిన సీఎం మీడియాతో అంటీముట్టనట్లుగానే ఉన్నారు. సీఎంను కలిసేందుకు వచ్చిన జైపూర్, పెగడాపల్లి, గంగిపల్లి గ్రామస్తులతో కొద్ది సేపు మాట్లాడారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసిత కుటుంబాల్లో అర్హులైన వారికి ఈ ప్లాంటులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మంచిర్యాలను జిల్లాగా మార్చుతామని సీఎం కేసీఆర్ మరోమారు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపడతామన్నారు.
మరోమారు వచ్చి రెండ్రోజులుంటా..!
ఈసారి కేవలం విద్యుదుత్పత్తి కేంద్రాన్ని పరిశీలించేందుకే వచ్చానని, త్వరలోనే మళ్లీ జిల్లాలో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండు రోజులు ఇక్కడే ఉండి, జిల్లా అభివృద్ధిపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.
కలెక్టర్‌కు ప్లాంటు పర్యవేక్షణ బాధ్యతలు..
జైపూర్ విద్యుదుత్పత్తి కేంద్రం పనుల పర్యవేక్షణ బాధ్యతలను సీఎం కేసీఆర్ కలెక్టర్ ఎం.జగన్మోహన్‌కు అప్పగించారు. పక్షం రోజులకోసారైనా ప్లాంటు నిర్మాణం పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి సూచించారు. ఈ ప్లాంటులో అదనంగా మరో 600 మెగావాట్లతో యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించిన కేసీఆర్.. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఆకస్మికంగా సీఎం పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆగమేఘాలపై ఏర్పాట్లు పూర్తి చేసింది. పర్యటన సజావుగా ముగియడంతో ఊపిరి పీల్చుకుంది. సీఎం కార్యక్రమంలో పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఎంపీలు గోడం నగేష్, బాల్క సుమన్, పార్లమెంటరీ సెక్రెటరీ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్రావు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, జి.విఠల్‌రెడ్డి, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాబూరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, సింగరేణి సీఎండీ సుదీర్థ బట్టాచార్య, డెరైక్టర్ (పా) రమేష్, బీహెచ్‌ఈఎల్ ఉన్నతాధికారులు, టీఆర్‌ఎస్ పార్టీ తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీష్, లోక భూమారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభా సత్యనారాయణగౌడ్, వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డి, టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు రాచకొండ కృష్ణారావు, సుద్దమల్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డీఐజీ ఆధ్వర్యంలో బందోబస్తు
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా కరీంనగర్ డీఐజీ మల్లారెడ్డి నేతృత్వంలో ఎస్పీ తరుణ్‌జోషి ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏఎస్పీ ఫణిభూషణ్ భారీ బందోబస్తు నిర్వహించారు. ముఖ్యమంత్రి రాకకు ముందు సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య, జిల్లా కలెక్టర్ జగన్మోహనరావు, పవర్ ప్లాంట్ ఈడీ సంజయ్ సూర్, మంచిర్యాల ఆర్డీవో అయేషాఖానంలు హెలీప్యాడ్ వద్ద సమావేశమయ్యారు. పర్యటన విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.