ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులను తేల్చేందుకు సీఐడీని రంగంలోకి దించిన తెలంగాణ సర్కారు దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేస్తోంది.
సాక్షి, మంచిర్యాల : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులను తేల్చేందుకు సీఐడీని రంగంలోకి దించిన తెలంగాణ సర్కారు దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న వాటితోపాటు తమరో రెండు నియోజకవర్గాలలోని లబ్ధిదారుల వివరాల ఆధారంగా రెండో విడత దర్యాప్తును చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 2006లో ప్రారంభ మైన ఈ పథకం కింద జిల్లాలో 53,963 ఇళ్లు మంజూరు కాగా లబ్ధిదారులు ఆయా దశలను పూర్తిచేసుకొని ఇప్పటివరకు రూ.814 కోట్లు పొందారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో సర్కారీ సొమ్ము లబ్ధిదారుల రూపేణా చెల్లించినప్పటికీ అర్హులకు దక్కలేదని సీఐడీ దర్యాప్తులో స్పష్టమైంది. అనుమతులతోపాటు బిల్లులు చెల్లించే దశలోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ధ్రువీకరించారు.
సీఐడీ బృందాలు రెండు బృందాలు మొదటి విడతలో భాగంగా ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో విచారణ చేపట్టాయి. శనివారం వరకు కొనసాగిన ఈ దర్యాప్తులో సుమారు 1900 ఇళ్లకు చెందిన అనుమతులు, బిల్లుల చెల్లింపు, సిమెంటు అందజేయడం, ఇటుకలకు బిల్లులు చెల్లింపు అంశాలను పరిశీలించారు. అదే సమయంలో ఆయా బ్యాంకులు, గృహ నిర్మాణశాఖ, గ్రామ సమైఖ్య సంఘాలకు చెందిన రికార్డులను క్షుణ్ణంగా విశ్లేషించారు. దాదాపు రూ.2కోట్ల వరకు సర్కారీ సొమ్ము పక్కదారి పట్టినట్లు తేలింది. ఈ నివేదికను సీఐడీ ఉన్నతాధికారి చారుసిన్హాకు అందజేసి ఆ తర్వాత వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మొదటి దశను కొనసాగిస్తూ రెండో దశకు సిద్ధం కావడంపై స్పష్టత రానున్నట్లు సమాచారం.