బతుకునిచ్చే పూలదేవత | Chilkur Balaji Temple Chairman Soundar Rajan Talk On Bathukamma | Sakshi
Sakshi News home page

బతుకునిచ్చే పూలదేవత

Sep 28 2019 7:02 AM | Updated on Sep 28 2019 7:02 AM

Chilkur Balaji Temple Chairman Soundar Rajan Talk On Bathukamma - Sakshi

సౌందరరాజన్‌

సాక్షి, మొయినాబాద్‌(చేవెళ్ల): ‘బతుకమ్మ అంటే పూల పండుగ.. ప్రకృతి పూలను అందంగా అలంకరించి పూజించే దేవత బతుకమ్మ. విగ్రహం లేకుండా పూజలందుకునే పూల దేవత. ఈమహోత్సవం సామాజిక సందేశం అందిస్తుందంటు’న్నారు చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ ఎంవీ సౌందరరాజన్‌ మాటల్లోనే బతుకమ్మ విశిష్టతను తెలుసుకుందాం. శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా.. అంటూ సాగే బతుకమ్మ పాట ప్రసిద్ధమైనది. బతుకమ్మ సర్వదేవతాస్వరూపం. లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ దేవీలు బతుకమ్మ స్వరూపంగా భావించి తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మను ఆరాధిస్తారు. సంపద, ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం, వైభవం, విద్య సంపదలను ఇవ్వాలని గౌరమ్మ రూపంలో కొలుస్తారు.

దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక పండుగలు, పర్వాలు జరుగుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగంగా కొద్దిపాటి తేడాతో పండుగలు నిర్వహిస్తారు. కానీ తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే బతుకమ్మ పండుగ మాత్రం ఈ ప్రాంత ఆత్మను ప్రకటిస్తుంది. జనసామాన్యంలో నుంచి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ బతుకమ్మ. బతుకమ్మకు  జీవించు–బతికించు అని అర్థం. అదే తెలంగాణ సంస్కృతిలో ఆయువుపట్టుగా నిలిచింది. అన్యోన్య అనురాగం, ప్రేమించేతత్వం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉందంటే దానికి మూలం బతకమ్మలో కనిపిస్తుంది. 

బతుకమ్మ పండుగకు గొప్ప చారిత్రక ఆధారం కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయులు గొప్పగా పాలించారు. కాకతీయ రాజ్యపాలకుడైన ‘గుండన’ పాలనలో పొలం దున్నతుండగా గుమ్మడితోటలో ఓ స్త్రీదేవతా విగ్రహం లభించింది. గుమ్మడిని సంస్కృతంలో కాకతి అని పిలుస్తారు. గుమ్మడితోటలో లభించినందువల్ల కాకతమ్మ అనే పేరుతో రాజులు ఆమెను పూజించారు. రాజులతోపాటు ప్రాంత ప్రజలు కూడా పూజించేవారు. రానురాను విగ్రహం కన్నా విగ్రహం ముందు పూలకుప్పలు పోసి వాటిని పూజించడం మొదలు పెట్టారు. పూలకుప్పలే దేవతా స్వరూపంగా మారిపోయింది. కాకతమ్మ అనే శబ్ధం క్రమంగా భాషాశాస్త్రపరంగా ఉచ్చరణలో బతుకమ్మ పేరుగా మారినట్లు పరిశోధకులు డాక్టర్‌ కసిరెడ్డి తెలియజేశారు.

బతుకమ్మలో సామాజిక సందేశం
పూలతో ఆరాధించే బతుకమ్మకు ఎలాంటి విగ్రహం లేదు. ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలను ఒక్కచోట పేర్చి బతుకమ్మగా అలంకరిస్తారు. ఏ జీవి అయినా మట్టిలో నుంచి పుట్టి చివరకు మట్టిలోనే కలిసిపోతుందనే సామాజిక సందేశం బతుకమ్మలో కనిపిస్తుంది. మట్టి నుంచి పుట్టిన చెట్టు. ఆ చెట్ల నుంచి వచ్చే పూలు, పూలతో తయారైన బతుకమ్మ నీటిలో కలిసిపోయి మళ్లీ మట్టిగా మారుతుంది. అలాగే జీవులన్నీ ఎక్కడి నుంచి పుట్టినా భోగాలు అనుభవించి చివరకు మళ్లీ మట్టిలోనే కలుస్తాయనే ఆధ్యాత్మిక, తాత్విక సందేశాన్ని బతుకమ్మ పండుగ ఇస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement