చౌకగా ఔషధాల ఉత్పత్తే లక్ష్యం  | Centre for alternatives to animal experiments launched | Sakshi
Sakshi News home page

చౌకగా ఔషధాల ఉత్పత్తే లక్ష్యం 

Apr 26 2019 12:23 AM | Updated on Apr 26 2019 12:23 AM

Centre for alternatives to animal experiments launched - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ఔషధాల తయారీ ఖర్చులను గణనీయంగా తగ్గించేందుకు హ్యూమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లు చేతులు కలిపాయి. జంతువులపై ప్రయోగాలను పూర్తిగా పరిహరించేం దుకు ఉన్న అవకాశాలను ప్రామాణీకరించడం.. ఫార్మా రంగంలోని అన్ని వర్గాల వారిని ఒక ఛత్రం కిందకు తీసుకొచ్చేందుకు సీసీఎంబీ అనుబంధ సంస్థ అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్, హ్యూమన్‌ సొసైటీలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మందుల తయారీలో జరిపే అనేక పరీక్షలు జంతువులపై చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే చాలా సందర్భాల్లో కచ్చితంగా చెప్పాలంటే 90–92 శాతం వరకు ఈ జంతువులపై ప్రయోగాల్లో సత్ఫలితాలిచ్చిన మందులు మానవ ప్రయోగాల్లో మాత్రం సరైన ఫలితాలివ్వవు. ఈ క్రమంలోనే అనేక జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. అయితే శాస్త్ర రంగంలో వచ్చిన మార్పుల కారణంగా ప్రస్తుతం జంతువుల అవసరం లేకుండా మందుల సామర్థ్యాన్ని, విషతుల్యతలను పరీక్షించేందుకు కొన్ని పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అధిక శాతం మందులు జీర్ణమయ్యే కాలేయాన్ని మానవ కణాల సాయంతో సూక్ష్మస్థాయిలో అభివృద్ధి చేసి పరీక్షించడం వీటిల్లో ఒకటి. సీసీఎంబీ, హ్యూమన్‌ సొసైటీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇలాంటి ప్రత్యామ్నాయాలన్నింటినీ అధ్యయనం చేస్తారు. వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు చట్టాలు, మార్గదర్శకాల్లో చేయాల్సిన మార్పులు/చేర్పులనూ సిద్ధం చేస్తారు. 

కణ ఆధారిత మాంసం తయారీ పరిశోధన కేంద్రం ఏర్పాటు 
మాసం కోసం జంతువులను వధించడం వల్ల ఒక వైపు వాటి సంఖ్య తగ్గుతుండగా మరోవైపు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించేందుకు గాను శాస్త్రవేత్తలు మొక్కల నుంచి శుద్ధమైన మాంసం (క్లీన్‌ మీట్‌) తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), జాతీయ మాంస పరిశోధనా సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు సాగించేందుకు గాను సీసీఎంబీలోని అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో ఒక కణ ఆధారిత మాంస తయారీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో పరిశోధనలు చేసి కణాధారిత మాంసాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ముందుకొచ్చింది. అందుకు సంబంధించిన పత్రాలపై గురువారం సంతకాలు కూడా చేసింది. 

తక్కువ సమయంలోనే: సీసీఎంబీ డైరెక్టర్‌ 
‘జంతువులపై ప్రయోగాలనేవి లేకపోతే మందుల తయారీకి అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా.. మొత్తం వ్యవహారమంతా అతి తక్కువ సమయంలో పూర్తవుతుంది..’అని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. గతేడాది తాము పరిశోధనశాలలోనే కణ ఆధారిత మాంసాన్ని ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని.. కేంద్ర బయో టెక్నాలజీ విభాగం ఈ ప్రాజెక్టుకు రూ.4.5 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. అటల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రంలో కణ ఆధారిత మాంసాన్ని ఉత్పత్తి చేసేందుకు గాను అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు అందించేందుకు ఒప్పుకుందన్నారు. ఒప్పందం కుదిరిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో çహ్యూమన్‌ సొసైటీ ప్రతినిధులు జయసింహ, అలోక్‌పర్ణ సేన్‌గుప్తా, అటల్‌ ఇంక్యుబేషన్‌ సింటెర్‌ సీఈవో మధుసూదనరావు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement