చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

Central Home Ministry Requested Chintamaneni To Submit Related Files - Sakshi

పౌరసత్వ రద్దు నిర్ణయం అమలు నిలిపివేత

సంబంధిత ఫైళ్లు ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం అమలును 4 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఈనెల 20 జారీ చేసిన ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం విచారించారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్‌ 10 ప్రకారం చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేయడం చెల్లదని ఆయన న్యాయవాది వాదించారు. కేంద్ర హోం శాఖ 2017 డిసెంబర్‌ 13న జారీ చేసిన ఆదేశాల తరహాలో తిరిగి సాంకేతికంగానే నిర్ణయం తీసుకుందన్నారు. 2017 నాటి రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని, అప్పుడు జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం పట్టించుకోలేదని నివేదించారు. మళ్లీ అదే తరహాలో రద్దు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్‌10ని ఉల్లంఘిస్తేనే పౌరసత్వం రద్దు చేయడానికి వీల్లేదని అదే చట్టంలోని సెక్షన్‌ 10(3) స్పష్టం చేస్తోందని తెలిపారు.

భారత పౌర సత్వం కోసం 2008 మార్చి 31న చెన్నమనేని దరఖాస్తు చేసుకుంటే 2009 ఫిబ్రవరి 3న పౌర సత్వం వచ్చిందని, ఈ మధ్యకాలంలో చెన్నమనేని జర్మనీలో పది మాసాలు ఉంటే, భారత్‌లో కేవలం 2 నెలలే ఉన్నారని కేంద్రం తరఫు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌రావు వాదించారు. చెన్నమనేని పౌరసత్వ రద్దు నిర్ణయంపై జోక్యం చేసుకోవాల్సినదేమీ లేదని, ఇదే విధంగా 2009 నుంచి ఆయన వాదిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిపోయిన ఆదిశ్రీనివాస్‌ తరఫు న్యాయవాది పేర్కొ న్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి చెన్నమనేని పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు, దానిపై జరిగిన లావాదేవీల ఫైళ్లను తమ ముందుంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. అనంతరం విచారణను డిసెంబర్‌ 16కి వాయిదా వేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top