పాకెట్‌ మనీ రూ.500 ..

Central Govt Giving RS 500 For SC Hostel Students - Sakshi

ప్రతినెలా విద్యార్థుల ఖాతాలో జమ

ఎస్సీ వసతి గృహాల్లోని వారికి ప్రయోజనం 

సాక్షి,  నిర్మల్ : విద్యతోనే ప్రగతి సాధ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి ఎస్సీ వసతి గృహాల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నారు. ట్యూషన్‌ ఫీజు, మెస్‌బిల్లు, పరీక్ష ఫీజు ఇలా ఎన్నో మినహాయింపు ఇస్తున్నారు. అయితే విద్యార్థి దశ నుంచి కళాశాల స్థాయికి వచ్చే సరికి ఆర్థిక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. జేబు ఖర్చులు కూడా ఇంటి నుంచి తెచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో లోలోన మదనపడుతున్నారు. వీరి ఇబ్బందులు ఇక దూరం కానున్నాయి. 

కళాశాల విద్యార్థులకు నెలకు రూ.500 
కళాశాల వసతి గృహాల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు జేబు ఖర్చుల కింద సాయం అందించే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వీరికి ప్రతి నెల ఠంచన్‌గా నెలకు రూ.500చొప్పున అందజేయనుంది. ప్రస్తుతం వసతి గృహాల్లో కేవలం పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు మాత్రమే కాస్మోటిక్‌ చార్జీ లు అందిస్తున్నారు. బాలురకు రూ.62, బాలికలకు 3 నుంచి 7వ తరగతి చదివేవారికి రూ.55, అలాగే 8,9,10 తరగతుల వారికి రూ.75 అందిస్తున్నారు. కేవలం పదో తరగతి వరకు విద్యనభ్యసించి, మధ్యలో ఆపివేయకుండా ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు సైతం నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో వసతి ఏర్పాటు చేసింది. ఈ మేరకు షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కళాశాల వసతి గృహాలను జిల్లాలో ఇదివరకే ఏర్పాటు చేశారు. 

జిల్లాలో ఇలా అమలు.. 
నిర్మల్‌ జిల్లాలో మొత్తం ఐదు ఎస్సీ కళాశాలల వసతి గృహాలు ఉన్నాయి. నిర్మల్‌లో రెండు బాలికల, ఒకటి బాలుర వసతి గృహం ఉండగా, భైంసాలో ఒకటి బాలికల, ఒకటి బాలుర వసతి గృహం ఉంది. ఇందులో మొత్తం 366మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ వసతి గృహాల్లో పారామెడికల్, నర్సింగ్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు చదువుకుంటున్నారు. కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు ప్రభుత్వం కేవలం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందిస్తోంది. కాస్మోటిక్‌ చార్జీలు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచి డబ్బులు తెచ్చుకుని ఇతర అవసరాలకు ఖర్చు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఆర్థికభారం కావడంతో నెలనెలా అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఎస్సీ కళాశాల వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నెలకు రూ.500 చొప్పున సాయం అందించనుంది. నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకే ఈ సొమ్ము జ మ చేయనుంది. అయితే ప్రతి నెలా ఈ డబ్బు లు పొందాలంటే 75శాతం హాజరు, 20 రోజు ల పాటు వసతి గృహంలో ఉండాలన్న నిబంధనలు విధించింది. ఇందుకోసం విద్యార్థి ప్రతి నెలా హాజరుకు సంబంధించి ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 

75శాతం హాజరు తప్పనిసరి 
విద్యార్థులకు పాకెట్‌ మనీ కింద ప్రతినెలా డబ్బులు జమచేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల్లో 75శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ విద్యా సంవత్సరం జూన్‌  నుంచి విద్యార్థుల అకౌంట్‌లో డబ్బులు జమకానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సాయం అందిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అవసరాలకు మాత్రమే వినియోగించుకుని ఉత్తమ ఫలితాలపై దృష్టి సారించాలి. 
– కిషన్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top