అదనంగా 2,660 సీట్లు 

Central government raised seats in National level educational institutions - Sakshi

మహిళల కోసం ప్రత్యేకంగా 2,059 సీట్లు 

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో సీట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం 

మొత్తంగా 45,244కి చేరిన సీట్ల సంఖ్య 

మొదలైన జోసా ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ 

ఈ నెల 25 వరకు చాయిస్‌ ఫిల్లింగ్‌కి అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 19 నుంచి విద్యార్థుల నుంచి చాయిస్‌ ఫిల్లింగ్‌కు (వెబ్‌ ఆప్షన్లు) అవకాశం కల్పిస్తామని జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ప్రకటించినా.. ఆదివారం నుంచే ప్రారంభించింది. మొత్తంగా ఏడు దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహణకు చర్యలు చేపట్టింది. జూలై 23 వరకు ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించేలా ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టు చేయాల్సిన రిపోర్టింగ్‌ కేంద్రాల వివరాలను జోసా వెబ్‌సైట్‌ లో  ( https://josaa.nic.in) అందుబాటులో ఉంచింది. రిపోర్టింగ్‌ కేంద్రాల్లో నిర్ణీత తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టె్టన్స్‌/సీట్‌ విత్‌డ్రాకు అవకాశం ఉంటుందని వివరించింది. 

అదనంగా 4,719 సీట్లు.. 
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో కేంద్రం ఈసారి సీట్లను భారీగా పెంచింది. ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్స్‌ (ఈడబ్ల్యూఎస్‌) కోసం 10 శాతం రిజర్వేషన్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం ప్రత్యేకంగా సీట్లను పెంచింది. మరోవైపు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సూపర్‌ న్యూమరీ కోటా కింద ఏటేటా సీట్లను పెంచుతోంది. దీనిలో భాగంగా ఈసారి కూడా 2,059 సీట్లను పెంచింది. మరోవైపు ఈడబ్ల్యూఎస్‌ కింద 2,660 సీట్లను అదనంగా పెంచింది. ఇలా మొత్తంగా 4,719 సీట్లను ఈసారి అదనంగా పెంచింది. 

107 విద్యా సంస్థల్లో 45,244 సీట్లు.. 
ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌ఐటీలలో ఈసారి సీట్లు ఎక్కువగా పెరిగాయి. మహిళల సూపర్‌ న్యూమరీ సీట్లతోపాటు ఈడబ్ల్యూఎస్‌ కోటా అదనంగా రావడంతో సీట్లు ఎక్కువగా పెరిగాయి. దేశంలోని 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 25 ట్రిపుల్‌ఐటీ, 28 జీఎఫ్‌టీఐలు మొత్తంగా 107 విద్యా సంస్థల్లో గతేడాది 41 వేల వరకు అందుబాటులో ఉండగా, ఈసారి వాటి సంఖ్య 45,244కి పెరిగింది. 

ఎన్‌ఐటీల్లో ఎక్కువగా పెరుగుదల.. 
ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ఈసారి ఎన్‌ఐటీల్లో సీట్లు ఎక్కువగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి 1,384 సీట్లు అదనంగా వచ్చాయి. ఐఐటీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 638 సీట్లు పెరిగాయి. ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లు హోంస్టేట్‌ కోటా కింద ఉన్నందున ఆయా రాష్ట్రాల వారికి ఈడబ్ల్యూఎస్‌ కోటా పెరిగిన సీట్లతో అధిక ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు మహిళల భాగస్వామ్యం కోసం అదనంగా ఇస్తున్న సూపర్‌ న్యూమరీ సీట్ల సంఖ్య ఐఐటీల్లో ఎక్కువగా పెరిగింది. ఈసారి 1,221 సీట్లు ఐఐటీల్లోనే పెరిగాయి.  

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌.. 
21–6–2019: ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూట్‌ టెస్టు రాసే వారికి చాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రారంభం 
25–6–2019: ఏఏటీ, ఇతరులందరికీ సాయంత్రం 5 గంటలకు చాయిస్‌ ఫిల్లింగ్‌ ముగింపు 
27–6–2019: ఉదయం 10 గంటలకు మొదటి దశ సీట్ల కేటాయింపు 
28–6–2019 నుంచి జూలై 2 వరకు: రిపోర్టింగ్‌ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్‌ 
3–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్‌ప్లే 
3–7–2019: సాయంత్రం 5 గంటలకు రెండో దశ సీట్ల కేటాయింపు 
4–7–2019 నుంచి 5–7–2019 వరకు: రిపోర్టింగ్‌ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్స్‌/విత్‌డ్రా 
6–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్‌ప్లే 
6–7–2019: సాయంత్రం 5 గంటలకు మూడో దశ సీట్ల కేటాయింపు 
7–7–2019 నుంచి 8–7–2019 వరకు: రిపోర్టింగ్‌ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్స్‌/విత్‌డ్రా 
9–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్‌ప్లే 
9–7–2019: సాయంత్రం 5 గంటలకు నాలుగో దశ సీట్ల కేటాయింపు 
10–7–2019 నుంచి 11–7–2019 వరకు: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రిపోర్టింగ్‌ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్స్‌/విత్‌డ్రా 
12–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్‌ప్లే 
12–7–2019: సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్ల కేటాయింపు 
13–7–2019 నుంచి 14–7–2019 వరకు: రిపోర్టింగ్‌ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్స్‌/విత్‌డ్రా 
15–7–2019:    ఉదయం 10గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్‌ప్లే, అదే రోజు సాయంత్రం 5 గంటలకు 6వ దశ సీట్లు కేటాయింపు 
16–7–2019 నుంచి 17–7–2019: రిపోర్టింగ్‌ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్స్‌/విత్‌డ్రా (ఐఐటీల్లో సీట్‌ విత్‌డ్రాకు ఇదే చివరి అవకాశం) 
18–7–2019:    ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్‌ప్లే, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు 7వ దశ (చివరి) సీట్ల కేటాయింపు 
19–7–2019: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రిపోర్టింగ్‌ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలేజీల్లో చేరికలు 
19–7–2019 నుంచి 23–7–2019 వరకు: ఎన్‌ఐటీ ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్స్, ప్రవేశాలు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top