పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్ధం

CCI Is Ready To Cotton Purchases Centers Karimnagar - Sakshi

కరీంనగర్‌సిటీ: పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) సిద్ధమయ్యింది. బహిరంగ మార్కెట్‌లో పత్తి పంటకు అధిక ధరలు పలుకుతున్న క్రమంలో నిన్నామొన్నటి వరకు ప్రైవేట్‌ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ధరలు పతనమవుతున్న నేపథ్యంలో పత్తి పంటకు మద్దతు ధర కల్పిం చేందుకు సీసీఐ రంగంలోకి దిగింది. సీసీఐ ద్వారా జిల్లాలోని 4 మార్కెట్‌యార్డులు, 8 జిన్నింగ్‌ మిల్లుల్లో విడి పత్తి కొనుగోలు చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్‌శాఖ డీడీ పద్మావతి తెలిపారు. కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డు, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర మార్కెట్‌యార్డుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

శక్తి మురుగన్‌ ఇండస్ట్రీస్‌ (ఎలబోతారం), మల్లారెడ్డి కాటన్‌ ఇండస్ట్రీస్‌(మల్కాపూర్‌), రామినేని ఆగ్రో ఇండస్ట్రీస్‌ (రేణికుంట), ఆదిత్య కాటన్‌ అండ్‌ ఆయిల్‌ ఆగ్రో (జమ్మికుంట), రాజశ్రీ కాటన్‌ ఇండస్ట్రీస్‌ (జమ్మికుంట), మురుగన్‌ ఇండస్ట్రీస్‌ (జమ్మికుంట), శివశివాని కాటన్‌ ఇండస్ట్రీస్‌ (రుక్మాపూర్‌), కావేరి జిన్నింగ్‌ మిల్లు (వెలిచాల) జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు పత్తిని 12 శాతం తేమ మించకుండా.. నీరు చల్లకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించి మార్కెట్‌యార్డుకు లేదా జిన్నింగ్‌ మిల్లులకు తీసుకొచ్చి సీసీఐకి విక్రయించి మద్దతు ధర పొందాలని పద్మావతి కోరారు. సీసీఐ 8 నుంచి 12 శాతం లోపు తేమశాతం ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. 12 శాతం మించితే సీసీఐ కొనుగోలు చేయబోదని పేర్కొన్నారు.

8 శాతం కంటే తేమ ఎక్కువగా ఉన్నట్లయితే క్వింటాల్‌ పత్తికి రూ.5450లోపు చెల్లిస్తారని తెలిపారు. సీసీఐకి పత్తిని అమ్ముకునే రైతులు గత సంవత్సరం వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ద్వారా జారీ చేసిన పత్తి రైతు గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. గుర్తింపు కార్డు లేని పక్షంలో సంబంధిత వ్యవసాయ విస్తీర్ణాధికారి జారీ చేసిన పత్తి రైతు ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని పేర్కొన్నారు. గుర్తింపుకార్డు, ధ్రువీకరణ పత్రంతో పాటు పట్టాదారు పాసు పుస్తకం, పహాణి జిరాక్స్, ఆధార్‌కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా పుస్తకంలోని మొదటి రెండు పేజీలు జిరాక్స్‌ తీసుకుని రావాలని కోరారు. ఇప్పటివరకు జిల్లాలోని మార్కెట్‌  యార్డులో 46,354 క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేశారని తెలిపారు. పత్తి రైతులు నాణ్యతా ప్రమాణాలతో పత్తిని తీసుకువచ్చి సీసీఐ ద్వారా మద్దతు ధర పొందాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top