మత్తయ్య అరెస్ట్‌పై హైకోర్టు స్టే | Cash-for-vote case: HC stays Mathaiah's arrest | Sakshi
Sakshi News home page

మత్తయ్య అరెస్ట్‌పై హైకోర్టు స్టే

Jun 19 2015 4:49 AM | Updated on Sep 22 2018 8:25 PM

మత్తయ్య అరెస్ట్‌పై హైకోర్టు స్టే - Sakshi

మత్తయ్య అరెస్ట్‌పై హైకోర్టు స్టే

ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరూసలేం మత్తయ్య అరెస్ట్‌పై హైకోర్టు స్టే విధించింది.

* 24 వరకు అరెస్ట్ వద్దని ఏసీబీకి ఆదేశం
* హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరూసలేం మత్తయ్య అరెస్ట్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 24 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ శివశంకరరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మత్తయ్య హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ శివశంకరరావు విచారించారు. మత్తయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి, స్పెషల్ పీపీ వి.రవికిరణ్‌రావు తమ తమ వాదనలు వినిపించారు.

ముందుగా సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో నిందితులను ఇరికించాలన్న ఉద్దేశంతోనే ఫిర్యాదుదారు స్టీఫెన్‌సన్ మత్తయ్య తదితరులను పిలిచి ఓటు గురించి మాట్లాడారని తెలిపారు. చట్టప్రకారం ఈ కేసులో మత్తయ్యే కాక నేరానికి ప్రేరేపించిన స్టీఫెన్‌సన్ శిక్షార్హుడేనన్నారు. ఈ సమయంలో ఏజీ రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ, గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టును కోరారు. దీనికి న్యాయమూర్తి, ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు వినేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని, కౌంటర్ దాఖలుకు గడువు కావాలంటే అప్పటి వరకు పిటిషనర్ అరెస్ట్‌పై స్టే ఇస్తానని స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఏజీ చెప్పడంతో న్యాయమూర్తి అంగీకరిస్తూ, అప్పటి వరకు మత్తయ్యను అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
 
దురుద్దేశాలతోనే కేసు...
గత నెల 28న స్టీఫెన్‌సన్ ఫిర్యాదు చేస్తే 31న ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, దీని వెనుక దురుద్దేశాలున్నాయని మత్తయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగే అక్రమాలు, అవకతవకలు అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి రావని తెలిపారు. ప్రస్తుత కేసులో తనకు ఐపీసీ సెక్షన్లు మాత్రమే వర్తిస్తాయని, అవి బెయిల్ మంజూరు చేయదగిన నేరాలని వివరించారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేయడానికీ, దర్యాప్తు చేయడానికీ ముందు కోర్టు అనుమతి తీసుకోలేదని, ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఈ కేసులో స్టీఫెన్‌సన్ ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేయకుండా, ఏసీబీ అధికారులను ఆశ్రయించారని, దురుద్దేశపూరితంగా ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇలా చేశారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement