ఉజ్వల భవిష్యత్‌కు భరోసా

career cell in warangal niit campus - Sakshi

విద్యార్థుల కోసం కెరీర్‌ సెల్‌ ఏర్పాటు

నూతన ఒరవడికినాంది పలికిన ప్రశాంత్‌ రాంశెట్టి

విద్య, ఉద్యోగావకాశాలపై కౌన్సెలింగ్‌

నిపుణులచే అవగాహన సదస్సులు

ఆదర్శంగా నిలుస్తున్న నిట్‌ విద్యార్థి

కాజీపేట అర్బన్‌: వరంగల్‌ నిట్‌ క్యాంపస్‌ నుంచే చక్కని ఉద్యోగావకాశాలను సొంతం చేసుకునేందుకు ఓ విద్యార్థి నడుంబగించాడు. ఉన్నత విద్య, క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు నిష్ణాతులచే సలహాలు సూచనలు అం దించేందుకు సరికొత్తగా నిట్‌ వరంగల్‌ కెరీర్‌ సెల్‌ ను ఏర్పాటు చేసి ఔరా అన్పించుకున్నాడు. నిట్‌లోని కెమికల్‌ వి భాగంలో మూడో సంవత్సరం చదువుతున్న ప్రశాంత్‌ రాంశెట్టి స్టూడెంట్‌ కౌన్సిల్‌ సౌజన్యంతో నిట్‌ వరంగల్‌ కెరీర్‌ సెల్‌ను ప్రారంభించాడు. కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శిగా విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు పరిష్కరిస్తూ బాసటగా నిలుస్తున్నాడు. జనవరి 18న కెరీర్‌ సెల్‌ ప్రారంభమై విద్యార్థుల సేవలో దూసుకుపోతోంది. 

ఎస్‌ఎంపీతో అవగాహన సదస్సు...  
స్టూడెంట్‌ మెంటర్‌షిప్‌ ప్రోగ్రాం పేరిట వివిధ కళాశాల్లో ఉన్నత విద్య, క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు గాను సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. క్యాంపస్‌ ఇంటరŠూయ్వల ద్వారా ఎంపికైన వారితో సందేశాలు ఇప్పిస్తున్నాడు. ప్రపంచంలోనే ప్రాచుర్యం పొందిన గ్లాస్‌ మార్ట్‌ కంపెనీ సెయింట్‌ గోబెన్‌కు ఎంపికైన అక్షిత, మయంక్‌ నిట్‌లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. మన్‌హతన్‌ రివ్యూ పేరిట జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్‌లో విజయం సాధించి పీజీ, పీహెచ్‌డీ, ఎంబీఏలో అవకాశం సాధించేందుకు నినిపుణులచే సలహాలు ఇప్పిస్తున్నాడు.

స్టూడెంట్‌ సపోర్ట్‌ సర్వీస్‌
వరంగల్‌ నిట్‌లో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి స్టూడెంట్‌ సపోర్ట్‌ సర్వీస్‌ను రూపొందించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు సీనియర్లచే బోధిస్తున్నారు. రీసెర్చ్‌ మెథడాలజీ పేరిట నూతన పరిశోధనలపై మెళకువలను నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావు పవర్‌పాయింట్‌ ప్రెజ ంటేషన్‌ ఇస్తున్నారు. కెరీర్‌ సెల్‌ ద్వారా ‘ఇండిస్పెన్‌సెబుల్‌ రీసెర్చ్‌ టూల్స్‌’ పేరిట నిట్‌ పూర్వవిద్యార్థి  డాక్టర్‌ కోటేశ్వర్‌రెడ్డి ఆన్‌లైన్‌లో సలహాలు అందిస్తున్నారు.. దుబాయ్‌ నుంచి స్కైప్‌ యాప్‌ సాయంతో  ఆధునిక యంత్రాలపై అవగాహన కల్పించారు.

అవకాశాలు కల్పిస్తాం..
నిట్‌ వరంగల్స్‌ కెరీర్‌ సెల్‌ ద్వారా విద్యార్థులకు వివిధ రంగాల్లో అవకాశాలు అందించేందుకు కృషి చేస్తున్నా. వేసవి సెలవుల్లో ఐఐటీ ముంబాయి, ఢిల్లీకి వెళ్లాను. అక్కడ కెరీర్‌  సెల్, ఎస్‌ఎంపీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సేవలందిస్తున్నారు. వరంగల్‌ నిట్‌లో సైతం అటువంటి వేదికను రూపొందించా. ఆన్‌లైన్‌లో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందిస్తున్నా.  ఉన్నత విద్య, ఐఏఎస్, యూపీఎస్‌సీలపై అవగాహన అందించేందుకు కెరీర్‌ సెల్‌ తోడ్పడుతుంది. సాయంత్రం వేళ్లల్లో నిట్‌ డైరెక్టర్, స్టూడెంట్‌ కౌన్సిల్‌ ప్రోత్సాహంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. – ప్రశాంత్‌ రాంశెట్టి, నిట్‌ విద్యార్థి,ఎస్‌ఎంపీ, కెరీర్‌ సెల్‌ వ్యవస్థాపకుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top