
శుభకార్యానికి వస్తూ..
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రధాన రహదారిపై గల సదాశివనగర్ సమీపంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి నిర్మల్ వైపు వస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది.
ఖానాపూర్ : నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రధాన రహదారిపై గల సదాశివనగర్ సమీపంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి నిర్మల్ వైపు వస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బర్మూరి ప్రదీప్‌రావు(32), అతని సోదరి ప్రణీత(28), ప్రణీత భర్త జనార్దన్‌రావు(35) మృతి చెందారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొండగట్టు పరిధిలోని నాచ్‌పల్లిలో శుక్రవారం జరిగే శుభకార్యానికి ప్రదీప్‌రావు, అతని సోదరి ప్రణీత, బావ జనార్దన్‌రావుతో కలిసి ఒకే కారులో హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరారు. ఖానాపూర్‌లో ప్రదీప్ తల్లి ఉండటంతో ఆమెను తీసుకుపోవడానికి ఖానాపూర్‌కు నేరుగా వచ్చి కరీంనగర్‌కు వెళ్తామనుకున్నారు. ఖానాపూర్‌కు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రదీప్‌రావు, జనార్దన్‌రావు అక్కడిక్కడే మృతి చెందగా, ప్రణీతకు గాయాలు కావడంతో ఆమెను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది.
తొమ్మిది నెలల క్రితమే వివాహం
మృతుడు ప్రదీప్ స్వగ్రామం కడెం మండలం దిల్దార్‌నగర్ కాగా, 30 ఏళ్లుగా ఖానాపూర్‌లోనే స్థిరపడ్డారు. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన ప్రదీప్ గత సంవత్సరం నవంబర్‌లో వివాహమైంది. ప్రస్తుతం మంచిర్యాలలోని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య లావణ్య. ఏడు నెలల గర్భిణి. కాగా, జనార్దన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. వీరు మృతి చెందడంతో ఖానాపూర్, కడెం మండలాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.