బీఆర్‌జీఎఫ్ పనుల ఆమోదం కోసం బుధవారం ఉదయాధిత్య భవన్‌లో నిర్వహించిన జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం రాజకీయ దుమారానికి వేదికైంది.
- మంత్రి, ఎంపీ గుత్తా మధ్య వాగ్వాదం
- కింద కూర్చొని నిరసన తెలిపిన జెడ్పీటీసీలు
- గత ప్రభుత్వ హయాంలోని మంత్రులు, ఎంపీల ఇళ్ల వద్ద ధర్నా చేయండి : మంత్రి
- సభలో తీవ్ర గందరగోళం
రాంనగర్ : బీఆర్‌జీఎఫ్ పనుల ఆమోదం కోసం బుధవారం ఉదయాధిత్య భవన్‌లో నిర్వహించిన జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం రాజకీయ దుమారానికి వేదికైంది. నక్కలగండి ప్రాజెక్టుపై అధికార పక్షం, విపక్ష పార్టీల సభ్యులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. సమావేశం ప్రారంభమైన అరగంటకు విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వచ్చారు. నక్కలగండి ప్రాజెక్డు కోసం అప్పటికే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు కింద కూర్చోని నిరసన తెలిపారు. ‘కింద ఎందుకు కూర్చున్నారు. సీట్లలో కూర్చోండి’ అని మంత్రి వారిని కోరారు. నక్కలగండి ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్నా చేయాలనుకుంటే గత ప్రభుత్వంలో పని చేసిన మంత్రులు, ఎంపీల ఇళ్ల వద్ద చేయాలన్నారు. ఇది ఎవరు చేయిస్తున్నారో తెలుసని, తమకూ రాజకీయం చేయడం వచ్చని అన్నారు.
‘అవసరమైతే మా వాళ్లూ వచ్చి కింద కూర్చుంటారు. మేమేమీ భయపడం’ అని మంత్రి ఘూటుగా మాట్లాడారు. ‘నక్కలగండి ప్రాజెక్టును సందర్శించి దాని చరిత్ర తీస్తాం, దానికి ఎవరు బాధ్యులో కూడా చెబుతాం’ అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వాఖ్యలకు ఎంపీ గుత్తా కూడా తీవ్రంగానే స్పందించారు. మీరు ఇటీవల దేవరకొండ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడం వల్లే ప్రజల్లో అపోహ నెలకొంది. మంత్రిగా ప్రాజెక్టుపై సవివరమైన సమధానం చెప్పాల్సిన బాధ్యత ఉందనే విషయం మరువరాదన్నారు. మంత్రి జోక్యం చేసుకుంటూ నక్కలగండి ప్రాజెక్టుపై తాను అనని మాటలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
60 ఏళ్లుగా జిల్లా అభివృద్ధికి పని చేయని వాళ్లు తమపై తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఎంపీ గుత్తా జోక్యం చేసుకుంటూ పదే పదే 60 ఏళ్లు అనడం, వాడు, వీడు అంటూ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడడం తగదని హెచ్చరించారు. సభలో తీవ్రగందరగోళం చోటుచేసుకోవడంతో సభ్యులు కూర్చోవాలంటూ జెడ్పీ చైర్మన్ పదే పదే కోరారు. వాడు అని ఉంటే ఉపసంహరించుకోవడానికి అభ్యంతరం లేదని మంత్రి పేర్కొన్నారు. నక్కల గండిని రద్దు చేస్తానని తాను చెప్పలేదని తెలిపారు. ఎవరితో నిరసన చేయించాల్సిన అవసరం తమకు లేదని గుత్తా పేర్కొన్నారు. అందరం కలిసి జిల్లా సమగ్రభివృద్ధికి కలిసి కట్టుగా పని చేద్దామని ఇరువురు నాయకులు అనడంతో సమావేశంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.