రెవెన్యూ బదిలీలకు బ్రేక్‌? | Break for revenue transfers? | Sakshi
Sakshi News home page

రెవెన్యూ బదిలీలకు బ్రేక్‌?

Jun 5 2018 1:35 AM | Updated on Jun 5 2018 1:35 AM

Break for revenue transfers? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూశాఖలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు బ్రేక్‌ పడే పరిస్థితి కనిపిస్తోంది. భూ రికార్డుల ప్రక్షాళన, పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రి య ముగింపు దశలో ఉన్నందున ఆ శాఖ పరిధిలో బదిలీలను నిలిపేయాలని ఉన్నతాధికారులు యోచి స్తున్నట్లు సమాచారం.

బదిలీల ప్రక్రియ ఈ నెల 15 లోగా ముగియాల్సి ఉన్నా ఇంతవరకు ఎలాంటి కస రత్తు జరగకపోవడంతో పాటు బదిలీలు చేపట్టవద్దని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావడం ఆ శాఖ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 20 లోగా పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తయ్యాక బదిలీలు చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

గజిబిజి.. గందరగోళం
రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత వాటి ఆధా రంగా పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రియ కొనసాగు తోంది. ఇప్పటివరకు సుమారు 42 లక్షల పాస్‌పుస్త కాల పంపిణీ పూర్తయింది. మరో 7 లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంది. పంపిణీ చేసిన పుస్తకాల్లో భారీగా తప్పులు దొర్లడం తో వాటిని సరిచేయాల్సి ఉంది.

ఈ తరుణంలో సాధారణ బదిలీలు చేస్తే అంతా గందరగోళంగా మారుతుందన్నది ఉన్నతాధికారుల వాదన. గ్రామం పై అవగాహన ఉన్న సిబ్బంది చేస్తేనే కొన్ని ఇబ్బం దులు వచ్చాయని, ఇప్పుడు కొత్త సిబ్బందిని పంపితే పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రియ కష్టమవుతుందని వారంటున్నారు. దీంతో పాస్‌పుస్తకాల పంపిణీ పూర్త య్యే దాకా బదిలీలు చేయొద్దని భావిస్తున్నారు.

బదిలీలు లేకుంటే మళ్లీ కష్టాలే...
రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని విజ యవంతం చేయడం తమ బాధ్యతే కానీ, నాలుగైదేళ్ల తర్వాత సాధారణ బదిలీలకు వచ్చిన అవకాశాన్ని కోల్పోతే మళ్లీ బదిలీలు ఎప్పుడు జరుగుతాయోననే ఆందోళన రెవెన్యూ సిబ్బందిలో వ్యక్తమవుతోంది. బదిలీలు తమ హక్కని, ఏదో కార్యక్రమం పేరు చెప్పి తమ హక్కులకు భంగం కలిగించడం భావ్యం కాదం టున్నారు.

ముఖ్యంగా జిల్లాల విభజన సమయంలో ఆర్డర్‌ టు సర్వ్‌ పేరుతో ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ బదిలీలు ఎప్పుడు ఉంటాయోనని ఎదురుచూస్తున్నామని, ఇప్పుడు తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. బదిలీలకు అనుమతివ్వకపోతే కనీసం మరో 2–3 ఏళ్లు తాము అవే కష్టాలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు.

మధ్యేమార్గంగా..
ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా మరో ప్రతిపాదనను రెవెన్యూ సంఘాలు తెరపైకి తెస్తున్నాయి. అన్ని శాఖ ల ఉద్యోగులతోపాటు తమకూ సాధారణ బదిలీల్లో అవకాశం కల్పించాలని, పాస్‌పుస్తకాల పంపిణీ అయ్యాకే బదిలీ అయిన సిబ్బందిని కొత్త స్థానాలకు పంపాలని, అప్పటి వరకు రిలీవ్‌ చేయకుండా పాత స్థానాల్లో పనిచేయించుకోవాలని వారు కోరుతున్నా రు.

ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిగణిస్తా మని ఉన్నతాధికారులు చెబుతున్నా పాస్‌పుస్తకాల పంపిణీ తర్వాతే బదిలీలు చేయాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ నెల 20 తర్వాతే రెవెన్యూశాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు సచివాలయ స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా బదిలీలపై నేడో, రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement