‘ట్రాన్స్ జెండర్ పోటీ చేయడం సహించలేకే ఇలా..’

BLF leaders fires on TG Govt over Transgender Chandramukhi abduction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రముఖి ఆచూకీ ఇంకా లభించలేదని బీఎల్ఎఫ్ ఛైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొవడం లేదని తెలిపారు. ఇది పోలీసుల చేతకాని తనమేనని మండిపడ్డారు. ఒక ట్రాన్స్ జెండర్ పోటీ చేయడం సహించలేకే ఇలా చేశారన్నారు. గోశామహల్‌లో పోటీ చేయబోయే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు నేర చరిత్ర ఉందన్నారు. 

దేశంలో మొదటిసారి ఒక హిజ్రా ఎన్నికల్లో పోటీ చేయబోతోందని, ఆమెను కిడ్నాప్ చేయడం దురదృష్టకరమని టీమాస్‌ ఫోరం చైర్మన్‌ ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే చంద్రముఖి ఆచూకీ లభించడం లేదన్నారు. ఈ ఘటనపై ఏ రాజకీయ పార్టీ నుండి కనీసం స్పందన లేదని మండిపడ్డారు. చంద్రముఖి సమస్యపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్‌ చేశారు. చంద్రముఖి విషయంలో టీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు. కోర్టులో హెబియస్ కార్పస్ రిట్‌ వేశామని, చాలా ప్రజా సంఘాలు ఈ కేసులో ఇంప్లిడ్ అవుతామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య అభివృద్ధికి చంద్రముఖి ప్రతీక అని కొనియాడారు. 

ఒక ట్రాన్స్ జెండర్ కిడ్నాప్ జరిగితే ఎవరు స్పందించకపోవడం బాధాకరమని ట్రాన్స్‌ జెండర్‌ ప్రతినిధి లైలా అన్నారు. చంద్రముఖి చాలా ప్రోగ్రెసివ్ వ్యక్తి అని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తామన్నారు. చంద్రముఖి పిరికి వ్యక్తి కాదని, ఖచ్చితంగా కిడ్నాప్ కి గురైందని తెలిపారు. చంద్రముఖి దొరికే వరకు గోశామహల్‌లో ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని నిప్పులు చెరిగారు.

మంగళవారం ఉదయం నుండి చంద్రముఖి కనపడడం లేదని, పౌర హక్కుల కోసం పోరాడే చంద్రముఖి కిడ్నాప్ కావడం దారుణమని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ కిడ్నాప్‌కు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. చంద్రముఖికి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారన్నారు. చంద్రముఖి బయపడి పారిపోయే వ్యక్తి కాదు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, లేదంటే దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top