మోదీ పాలన జనరంజకం

BJP Candidates Campaigning Road Show - Sakshi

 అన్ని వర్గాలకూ న్యాయం

ప్రధానమంత్రి సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ

కడ్తాల్‌లో బీజేపీ అభ్యర్థి ఆచారికి మద్దతుగా రోడ్‌షో

సాక్షి, కడ్తాల్‌: ప్రధాని నరేంద్రమోదీ పాలనలో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని, ప్రజలంతా మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని రేషన్‌ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షుడు, ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల కేంద్రంలో బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఆచారికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌ కాలనీలో  నిర్వహించిన కార్యక్రమంలో ప్రహ్లాద్‌ మోదీ మాట్లాడుతూ..   రాష్ట్రంలో కేసీఆర్‌ సంక్షేమ పథకాల పేరిట, ప్రజలను మభ్యపెట్టి అన్యాయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని దుయ్యబట్టారు. తన సోదరుడు దేశ ప్రధానిగా కొనసాగుతున్నా ఇప్పటికీ తాను రేషన్‌డీలర్‌గా ఉన్నానని తెలిపారు. దేశంలో రేషన్‌ డీలర్లకు కిలోకు 70 పైసలు కమీషన్‌ ఇస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం 20పైసలే ఇస్తున్నారని, డీలర్లు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ప్రధాని రేషన్‌ డీలర్ల కమీషన్‌ను 70 పైసలకు పెంచారని గుర్తు చేశారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ రేషన్‌ డీలర్లను అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ ఉద్యోగాలు కల్పించక, నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపారని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.  

సేవకుడిగా పనిచేస్తా: ఆచారి
35 ఏళ్లుగా కల్వకుర్తి నియోజకవర్గ సమస్యలపై పోరాడుతునే ఉన్నానని, తనను ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సేవకుడిగా పనిచేస్తానని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఆచారి కోరారు. రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అంటూ మాటలకే పరిమితమైందని ధ్వజమెత్తారు.

దేశంలో మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం ఆచారి సమక్షంలో ఎర్రోల శంకర్‌తో పాటు  వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిప్రసాద్, ఎంపీటీసీ వీరయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, ఆనంద్, డాక్టర్‌ రమేశ్‌ ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top