గెలుపు వ్యూహంలో బీజేపీ

BJP  Boot Camp Start In Warangal - Sakshi

సాక్షి, హన్మకొండ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోనూ తన సత్తా చాటాలని చూస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలతోపాటు, అనంతరం వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకులను అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా బాధ్యులను నియమించింది. వీరిని సమన్వయం చేసేందుకు పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో మరో ఇన్‌చార్జిని నియమించింది. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇద్దరేసి చొప్పున ఇన్‌చార్జిలను నియమించగా వారు జిల్లాకు చేరుకున్నారు.

వారికి పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో సమన్వయకర్తగా కర్ణాటక శాసనమండలి సభ్యుడు రఘునాథ్‌రావు మస్కపురిని పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. బీజేపీ వరంగల్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్‌చార్జీలను నియమించారు.  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించడంతో పాటు పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు తెలిపి రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. ఈ  క్రమంలో తెలంగాణలో పాగా వేయాలనే పట్టుదలతో బీజేపీ జాతీయ నాయకత్వం ముందుకు పోతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తరచూ రాష్ట్ర పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌లో పోలింగ్‌ బూత్‌ కమిటీల సభ్యుల సమావేశంలో పాల్గొని ఎన్నికల ఎదుర్కోవడంపై సూచనలు చేశారు.

బూత్‌ స్థాయి కమిటీల నిర్మాణం.. 
బీజేపీ జాతీయ నాయకత్వం పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడంలో భాగంగా బూత్‌ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. బూత్‌ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడం ద్వారానే ఎన్నికల్లో సులువుగా విజయం సాధించవచ్చని పార్టీ నమ్మకం. ఇందులో భాగంగా పోలింగ్‌ కేంద్రాల వారిగా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు కృషి చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన నియోజకవర్గ బాధ్యులు పోలింగ్‌ బూత్‌ల వారిగా కమిటీల వివరాలు సేకరిస్తూ పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ద్వారా జాతీయ నాయకత్వానికి సమాచారమిస్తున్నారు.  గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అప్పటి హన్మకొండ పార్లమెంట్‌ నియోజకవర్గంతోపాటు అప్పటి హన్మకొండ, ప్రస్తుత వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం, వర్ధన్నపేట, పరకాల, పూర్వ శాయంపేట నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారు. దీంతో జిల్లాలో మరోసారి పట్టు నిలుపుకోవాలనే ధృడసంకల్పంతో బీజేపీ నాయకత్వం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top