భట్టి సన్మాన సభలో రభస | Sakshi
Sakshi News home page

భట్టి సన్మాన సభలో రభస

Published Sun, Feb 3 2019 4:37 AM

Bhatti Vikramarka Honorary program has become rasamasa - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. ఓబీసీ సెల్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన రెండు వర్గాల నేతలు ఘర్షణకు దిగడంతో గందరగోళం నెలకొంది. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఓబీసీ సెల్‌ నగర అధ్యక్షుడు శ్రీకాంత్‌ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ చివరికి శ్రీకాంత్‌ సస్పెన్షన్‌కు దారితీసింది.శనివారం గాంధీభవన్‌లో ఓబీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిత్తరంజన్‌దాస్‌ ఆధ్వర్యంలో కొత్తగా ప్రతిపక్ష నేతగా ఎన్నికైన భట్టి విక్రమార్కకు సన్మానం ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ఎంపీ వీహెచ్, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

సన్మాన సభ మొదలైన కొద్ది సేపటికే వేదికపై ఉన్న వీహెచ్‌కు వ్యతిరేకంగా నగర ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్‌ వర్గీయులు ఆందోళనకు దిగారు. అంబర్‌పేట టికెట్‌ రాకుండా వీహెచ్‌ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో సహనం కోల్పోయిన వీహెచ్‌ వారిని దుర్భాషలాడారు. ఈ సమయంలో వీహెచ్‌ వర్గీయులు కొందరు నూతి శ్రీకాంత్‌ వర్గీయులపైకి దూసుకురావడంతో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాలు కుర్చీలతో, పిడిగుద్దులతో పరస్పరం దాడిచేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల వారిని సీనియర్‌ నేతలు శాంతింపజేసే ప్రయత్నం చేశారు.అయినా గొడవ సద్దుమణగక పోవడంతో హడావుడిగా కార్యక్రమాన్ని ముగించారు. 

నగర సెల్‌ పదవి నుంచి శ్రీకాంత్‌ తొలగింపు..
ఘర్షణకు కారణమైన శ్రీకాంత్‌ను నగర ఓబీసీ సెల్‌ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ సెల్‌ అధ్యక్షుడు చిత్తరంజన్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తనను సస్పెండ్‌ చేయడంపై నూతి శ్రీకాంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. తనకు మద్దతుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కార్యకర్తలను వీహెచ్‌ దుర్భాషలాడినం దునే తాను ప్రతిఘటించానని తెలిపారు.

మంద బలంతో గెలుద్దామంటే పప్పులుడకవ్‌: భట్టి
తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, లక్షలాదిమంది కాంగ్రెస్‌ కార్యకర్తల గొంతుక వినిపించాలని ప్రజలు తమను అసెంబ్లీకి పంపారని, ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తానని వాగ్దానం చేశారు. గెలుపోటములు రాజకీయాల్లో శాశ్వతం కాదని, కేసీఆర్‌ కంటే బలమైన నేతలు వచ్చారని, అనంతరం కాల గర్భంలో కలిశారన్నారు. కాంగ్రెస్‌ ఓడిపోయిందని, మంద బలంతో నియంత్రిద్దామనుకుంటే పప్పులుడకవని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలున్నా తనకు లేఖ రాయాలని కోరారు. కార్యక్రమం ముగిసిన అనంతరం నూతి శ్రీకాంత్, ఆయన వర్గీయులు భట్టి చాంబర్‌ వద్ద ధర్నాకు దిగారు. తనపై దుర్భాషలాడిన వీహెచ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తర్వాత వీహెచ్‌పై బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో శ్రీకాంత్‌ ఫిర్యాదు చేశారు.


 

Advertisement
 
Advertisement
 
Advertisement