ఒకే రోజులో ట్రిపుల్‌ సెంచరీ

Batsmen who Made a Triple Century in HCA League Match - Sakshi

హెచ్‌సీఏ లీగ్‌లో ‘గణేష్‌’ సంచలన ఇన్నింగ్స్‌

42 బౌండరీలు, 7 సిక్స్‌లతో 318పరుగులతో నాటౌట్‌

తొలి రోజు పాలమూరు 622/5

తెలంగాణ జిల్లా జట్లలో ఇదే అత్యధిక స్కోరు

సెంచరీతో రాణించిన మహేష్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) లీగ్‌లో పాలమూరు జట్టు రికార్డ్‌ స్కోర్‌ను నమోదు చేసింది. తెలంగాణ జిల్లాల జట్లలో పాలమూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. హైదరాబాద్‌లోని ఫిర్జాదిగూడ బాబురావుసాగర్‌ గ్రౌండ్‌–2లో సోమవారం జరిగిన హెచ్‌సీఏ టూడేస్‌ లీగ్‌లో భాగంగా రాజీవ్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు 5 వికెట్లు కోల్పోయి 622 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. తెలంగాణ జిల్లాల జట్లలో జిల్లా జట్టు రికార్డ్‌ స్కోర్‌ నమోదు చేసింది. టాస్‌ గెలిచిన తొలుత బ్యాటింగ్‌ చేసిన జిల్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 622 పరుగులు చేసింది. జట్టులో డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ గణేష్‌ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అత్యధిక వ్యక్తిగత రికార్డు స్కోర్‌ చేశాడు. హెచ్‌సీఏ టూడేస్‌ లీగ్‌లో తెలంగాణ జిల్లాల్లోని ఏ క్రీడాకారుడు సాధించని ఘనతను సాధించాడు. నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గణేష్‌ ట్రిపుల్‌ సెంచరీ చేసి రికార్డ్‌ సృష్టించాడు. రాజీవ్‌ సీసీ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 200 బంతుల్లో 42 ఫోర్లు, 7 సిక్స్‌లతో 318 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మహేష్‌బాబు సెంచరీ చేసి రాణించాడు. 78 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. సునీల్‌రెడ్డి (30 నాటౌట్‌) చేశాడు. రాజీవ్‌ క్రికెట్‌ క్లబ్‌ బౌలర్లు మన్‌కేషా 2, ధీరజ్, పవన్‌కల్యాణ్, ట్రైలోక్‌ చెరో వికెట్లు తీశారు. 
గణేష్‌ను అభినందించిన ఎండీసీఏ ప్రతినిధులు... 
హెచ్‌సీఏ టూడేస్‌ లీగ్‌లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన గణేష్‌ను మహబూబ్‌నగర్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా అభినందించారు. జిల్లా క్రీడాకారుడు గణేష్‌ ట్రిపుల్‌ సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని విజయాలు నమోదు చేసుకోవాలని వారు ఆకాంక్షించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top