పుదుచ్చేరి: హైదరాబాద్ సీమర్ పున్నయ్య (6–2–10–3) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో పుదుచ్చేరి బ్యాటర్ల పనిపట్టాడు. వర్షం వల్ల కేవలం 25 ఓవర్ల ఆటే జరిగినా... పుదుచ్చేరి పతనావస్థకు చేరింది. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో 25/1 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పుదుచ్చేరి వర్షంతో ఆట నిలిచే సమయానికి 34 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
టాపార్డర్ బ్యాటర్ ఆనంద్ బైస్ (41; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. పది మంది క్రీజులోకి రాగా... సిద్దాంత్ (16), గంగా శ్రీధర్ రాజు (11) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
హైదరాబాద్ సీమర్ పున్నయ్య ఆరు ఓవర్ల స్పెల్‌తోనే పుదుచ్చేరి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇతనికి జతగా తనయ్ త్యాగరాజన్ (2/41) స్పిన్ మాయాజాలంతో కీలకమైన వికెట్లను తీయడంతో పుదుచ్చేరి ఆలౌట్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం చేతిలో 2 వికెట్లు మాత్రమే మిగిలున్న పుదుచ్చేరి ఇంకా 343 పరుగులు వెనుకడి ఉంది. ఆటకు నేడు ఆఖరి రోజు. వర్షం వల్ల ఆట ఇంకా మొదలుకానేలేదు.
మూడో రోజు ఆట రద్దు
రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో ఆంధ్ర, బరోడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు మోంథా తుపాను అడ్డుపడింది. దీంతో మూడో రోజు ఒక్కబంతి కూడా పడకుండానే ఆట రద్దు అయ్యింది. బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 363 పరుగులు చేయగా, ఆంధ్ర రెండో రోజు ఆట వరకే 43/2 స్కోరు చేసింది.


