మరో నాలుగైదు రోజులు చీరల పంపిణీ

మరో నాలుగైదు రోజులు చీరల పంపిణీ


సాక్షి, హైదరాబాద్ ‌: బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మరో నాలుగైదు రోజులు పొడిగిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ ఎండీ శైలజా రామయ్యర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రకటించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గడువు పెంచాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. చీరల పంపిణీ తొలి రోజైన సోమవారం సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా తెల్లకార్డులున్న కుటుంబాల్లోని 1.04 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం తొలిరోజు సాఫీగా జరిగిందని చెప్పారు. సిరిసిల్ల చేనేత, మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించటంతోపాటు పేద మహిళలకు పండుగ కానుక అందించే సదుద్దేశంతో చేపట్టిన ఈ పథకం బృహత్తరమైందన్నారు. అక్కడక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా అవేవీ పరిగణనలోకి తీసుకునే అంశాలు కావన్నారు. ఇప్పటికే 80 శాతం చీరలు అన్ని ప్రాంతాలకు పంపిణీ కాగా.. మిగతా ఇరవై శాతం రెండ్రోజుల్లో రవాణా అవుతాయని చెప్పారు.చీరల నాణ్యత విషయంలో వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ‘‘ప్రతీ లాట్‌ను పక్కాగా పరిశీలించిన తర్వాతే పంపిణీకి సిద్ధం చేశాం. ఎక్కడన్నా చీరల్లో లోటుపాట్లు, డ్యామేజీ ఉంటే వెనక్కి ఇచ్చి మరొకటి తీసుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్రానికి అవసరమైన చీరలన్నీ సిరిసిల్లలోనే తయారు చేయాలంటే మూడేళ్లు పడుతుంది. కేవలం 3 నెలల ముందు రూపకల్పన చేసిన పథకం కావటంతో.. అందుబాటులో ఉన్న సమయం, వనరుల దృష్ట్యా సిరిసిల్ల మరమగ్గాలపై తయారు చేయించిన 58 లక్షల పాలిస్టర్‌ చీరలతో పాటు అదనంగా బయటి కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది.ఓపెన్‌ టెండర్‌ పిలిచి సూరత్‌ కంపెనీలకు ఈ ఆర్డర్‌ ఇచ్చాం’’ అని వివరించారు. సిరిసిల్లలో ఫిలమెంట్‌ పాలిస్టర్‌ రకం వస్త్రంతో చీరలు తయారు కాగా.. సూరత్‌లో ట్విస్టెడ్‌ పాలిస్టర్‌ రకం అందుబాటులో ఉందని, దీంతో చీరల్లో తేడా కనిపిస్తోందని పేర్కొన్నారు. సిరిసిల్ల చీరలకు ఒక్కో దానికి రూ.224, కంపెనీల నుంచి కొన్నవాటికి రూ.200 వెచ్చించినట్లు తెలిపారు. ఒకట్రెండు చోట్ల తప్ప రాష్ట్రమంతటా చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని, అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తమకు నివేదికలు అందినట్లు జయేశ్‌ రంజన్‌ చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top