
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 8 స్థానిక సంస్థలకు ఉత్తమ పంచాయతీ పురస్కారాలు దక్కాయి. జాతీయ పంచాయతీ దివస్ సందర్భంగా ఏప్రిల్ 24న ఈ అవార్డులను ఏటా కేంద్రం అందజేస్తోంది. ఇందులో ఈ ఏడాదికి దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్‌ను తెలంగాణలోని ఒక జిల్లా పరిషత్‌తోపాటు, 2 మండల పరిషత్‌లను, మరో 4 గ్రామపంచాయతీలను కేంద్రం ఎంపిక చేసింది. జిల్లా పరిషత్ విభాగంలో ఆదిలాబాద్, మండల పరిషత్ విభాగంలో సిద్దిపేటతోపాటు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల పరిషత్‌కు పురస్కారం దక్కింది. గ్రామపంచాయతీ విభాగంలో రాజన్న సిరిసిల్ల మండలం ముష్టిపల్లి, సిద్దిపేట మండలం ఇర్కోడు, రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్ మండలం గంటల్‌పల్లి, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల పురస్కారం దక్కించుకున్నాయి.
అవార్డుకు ఎంపికైన జిల్లా పరిషత్‌కు రూ.50 లక్షలు, మండల పరిషత్‌లకు రూ.25లక్షలు, గ్రామపంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కేంద్రం అందజేస్తుంది. నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కారాన్ని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి దక్కించుకుంది. ఈ కేటగిరీ కింద 10 లక్షల నగదు ప్రోత్సా హకం దక్కనుంది. 24న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో 2016–17లో ప్రతిభ కనబర్చిన అవార్డు గ్రహీతలకు కేంద్రం పురస్కారాలు అందజేయనుంది. అవార్డు గ్రహీతలను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు.