ఆప్తుడికే ఆపదొచ్చింది... | Auto Driver Suffering With Cancer in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆప్తుడికే ఆపదొచ్చింది...

Apr 3 2019 7:29 AM | Updated on Apr 6 2019 11:44 AM

Auto Driver Suffering With Cancer in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మనది కాని కాలం ఎదురైతే క్షణం చాలు జీవితం తలకిందులు కావడానికి.. అలాంటిపరిస్థితే ఓ మనసున్న నిరుపేదకు అనారోగ్యం రూపంలో ఎదురైంది. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లోనూ ఇతరులకు సేవ చేసేవాడు. వైద్యం కోసం నగరానికి వచ్చే నిరుపేదలకు సర్కారు దవాఖాలే దిక్కు.. అలాంటి వారికోసం నిమ్స్‌ ఆసుపత్రి ఎల్లప్పుడూ ఒక ఆటో సిద్ధంగా ఉంటుంది, దానిపై గర్భిణీ స్త్రీలకు ఉచితం..వృద్ధులకు, వికలాంగులకు ఫ్రీ’  అనే పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. కష్టాలు, కన్నీళ్లు తెలిసిన ఆటోవాలా సంజయ్‌ ఆపదలో ఉన్న వారికి తోచిన సాయం చేయడానికి ఆటోను ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు వేలాది మందికి ఉచితంగా సేవలందించాడు. ఆప్తుడిలా అందరినీ ఆదుకున్న అతడిరూ నేడు పెద్ద కష్టం వచ్చిపడింది. అనారోగ్యంతో బాధపడుతున్న తనను ఎవరైనా ఆదుకోకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. వివారాల్లోకి వెళితే..

తన భార్య పరిస్థితి మరెవరికీ రాకూడదని
బోరబండకు చెందిన మ్యాదరి సంజయ్‌ చిన్నతనంలోనే  తల్లిదండ్రులను కోల్పోయాడు. 20 ఏళ్ల క్రితం సెంట్రింగ్‌ కార్మికుడిగా పని చేస్తున్న అతడి భార్యకు అర్థరాత్రి పురుటి నొప్పులొచ్చాయి. ఆసుపత్రి తీసుకెళ్లేందుకు ఆటో కోసం వెళ్లగా రాత్రి వేళల్లో రాలేమని చెప్పారు. చివరకు ఓ పెద్దాయన రిక్షా ఇచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో తానే స్వయంగా  రిక్షాలో భార్యను నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆపరేషన్‌ చేసిన వైద్యులు ఆలస్యంగా తీసుకురావడంతో బిడ్డ ఊపిరాడక మృతి చెందిందని తెలిపారు. సకాలంలో తీసుకువచ్చినట్లయితే బిడ్డ బతికేదని చెప్పడంతో సంజయ్‌ కలత చెందాడు. ఆ ఘటన అతని మనసులో బలమైన ముద్రవేసింది. అలాంటి సందర్భాల్లో ఎవరున్నా వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. 

తోచినంతలో సాయం: తర్వాత కొన్నాళ్లకు సెంట్రింగ్‌ పనిమానేసి ఆటో కొనుక్కున్నాడు. భార్యా బిడ్డలను పోషించుకునేందుకు ఎంతో కొంత ఆదాయం వస్తోంది. తనకు తోచినంతలో ఆటో ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయం చేయాలనుకున్నాడు. దీంతో ‘ఆటో వెనక అమ్మానాన్నలకు ప్రేమతో.. గర్భిణి స్త్రీలకు ఉచితం..వృద్ధులు, వికలాంగులకు ఫ్రీ..అని రాయించాడు. ఏ సమయంలో అయినా ఎవరు ఫోన్‌ చేసినా గర్భిణులు, వికలాంగులు, వృద్ధులను ఆసుపత్రికి చేరవేసేవాడు. 

కేన్సర్‌తో పోరాటం: అందరి ఆపదలు తీర్చే సంజయ్‌కి అనారోగ్యం రూపంలో ఆపద ముంచుకొచ్చింది. అకస్మాత్తుగా అనారోగ్యం భారిన పడటంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు పేగు క్యాన్సర్‌గా నిర్దారించారు. సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్‌ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పడంతో రూ. 3.5 లక్షలు అప్పు చేసి ఆపరేషన్‌ చేయించుకున్నాడు. 2014లో మెడ్విన్‌ హాస్పిటల్‌లో డాక్టర్‌ ప్రదీప్‌ కేసరీ అతడికి శస్త్ర చికిత్స చేశారు. ఆరునెలల పాటు కీమో థెరపీ చేయించుకోవాలని సూచించారు.అప్పటి నుంచి ఓ వైపు ఆప్పుల బాధలు, మరోవైపు అనారోగ్యం అతడి జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి.  అదుకునే వారి కోసం అతడి కుటుంబం ఆశగా ఎదురు చూస్తోంది.  దీంతో ఆటో నడిపితే కాని ఇళ్లు గడవని సంజయ్‌ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు: ఆపరేషన్‌ తర్వాత కేన్సర్‌ ప్రభావం తగ్గినా, ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడకపోవడంతో ఆటో నడపడం కష్ట సాధ్యమైంది.  సంజయ్‌ భార్య ఇళ్లలో పనిచేస్తే వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇద్దరు పిల్లల చదువులు, ఇంటి అద్దెలకు తోడు చికిత్స కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో అతని కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. సంజయ్‌కి చేయూతనందించాలనుకునే వారు 8978564644 నంబర్‌ను సంప్రదించవచ్చు..  

జీవిత పోరాటంలో అలిసిపోయా..
ఆపరేషన్‌ చేయించుకున్నప్పటి నుంచి ఆటో నడపడానికి శరీరం సహకరించడం లేదు.  ఆపరేషన్‌ కోసం చేసిన అప్పులకు తోడు పిల్లల చదువులు, ఇంటి అద్దెలతో  బతుకు భారంగా మారింది. జీవనాధారంగా ఉన్న ఆటో కూడా పాడైపోయింది. నా పరిస్థితి చూసి ఒక టీవీ ఛానెల్‌ నిర్వాహకులు రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన రేషన్‌ కూడా అందడం లేదు. కనీసం రేషన్‌ సౌకర్యం కల్పించి,  డబుల్‌ బెడ్‌రూం ఇంటిని మంజూరు చేయాలి.     – సంజయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement