ఏసీబీ అధికారులు తమ మార్క్ చూపించారు. ఉనికి లేదనుకునే సమయంలో జూలు విదిల్చారు.
రూ. 40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
ఏసీబీ అధికారులు తమ మార్క్ చూపించారు. ఉనికి లేదనుకునే సమయంలో జూలు విదిల్చారు. భూపాలపల్లి తహసీల్దార్ మార్క చక్రధర్‌ను సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూ ఆసామి నుంచి రూ.40వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
- భూపాలపల్లి
భూపాలపల్లి : ప్రభుత్వ భూమి విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు కబ్జాదారుడి నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటూ భూపాలపల్లి తహ సీల్దార్ మార్క చక్రధర్ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపిన వివరాల ప్రకారం... భూపాలపల్లి పట్టణంలోని 194 సర్వే నంబర్‌లో ముత్యంరావు అనే భూస్వామికి చెందిన భూమిని 1975 సీలింగ్ చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ భూమిలోని ఎకరం 2 గుంటల స్థలంలో పట్టణానికి చెందిన కంభం రమేష్, చల్ల జక్కిరెడ్డి 2005లో భారత్ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. అయితే సదరు భూమి కేసు హైకోర్టులో ఉంది. తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు ఇటీవలే తహసీల్దార్‌కు సూచించింది. దీంతో ఫంక్షన్‌హాల్‌ను సీజ్ చేయకుండా అనుకూలంగా వ్యవహరించాలంటే రూ. 50 వేలు ఇవ్వాల్సిందిగా రమేష్, జక్కిరెడ్డిని తహసీల్దార్ మార్క చక్రధర్ డిమాండ్ చేశాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని రమేష్ కొద్ది రోజుల క్రితం ఏసీబీని ఆశ్రయించాడు. అధికారులు సూచించిన విధంగా సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో రూ. 40 వేలు తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ చక్రధర్‌కు అందజేశాడు. ఆ డబ్బును తహ సీల్దార్ ఒక ఫైలు కింద దాచిపెడుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. తహసీల్దార్‌ను విచారించిన అనంతరం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
డిసెంబర్ నుంచే ప్లాన్...
భూపాలపల్లి రెవెన్యూ కార్యాలయంలో అవినీతి పెట్రేగినట్లు ఏసీబీ అధికారులకు పలు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓ అధికారి సూచన మేరకు తహసీల్దార్ చక్రధర్ గత డిసెంబర్ నెలలో భారత్ ఫంక్షన్‌హాల్ యజమాని రమేష్‌ను లంచం అడిగినట్లు తెలిసింది.
అయితే లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని రమేష్ ఏసీబీని ఆశ్రయించాడు. కాగా తహసీల్దార్‌కు సూచనలిచ్చిన అధికారిని సైతం పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించగా విఫలమైనట్లు సమాచారం.
మూడు నెలల్లోనే ఇద్దరు..
మూడు నెలల కాల వ్యవధిలోనే భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. 2013 నవంబర్ 18న భూపాలపల్లి ఉత్తర అటవీ విభాగం డిప్యుటీ రేంజ్ ఆఫీసర్ మాధవరెడ్డి ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అనంతరం గత ఏడాది నవంబర్ 14న మండలంలోని జంగేడు వీఆర్వో జాకీర్‌హుస్సేన్ పట్టాదారు పాసుపుస్తకాల కోసం ఓ రైతు నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. వీఆర్వో పట్టుబడి సరిగ్గా మూడు నెలలు గడుస్తున్న క్రమంలోనే తహసీల్దార్ మార్క చక్రధర్ ఏసీబీ వలకు చిక్కాడు. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
నేను డబ్బులు తీసుకోలేదు : మార్క చక్రధర్, భూపాలపల్లి తహసీల్దార్
ప్రభుత్వ సీలింగ్ భూమిలో ఫంక్షన్‌హాల్ నిర్మించుకున్నందున రెగ్యులరైజేషన్ కోసం జీఓ నంబర్ 59 కింద దరఖాస్తు చేసుకోవాలని యజమాని రమేష్‌కు సూచించా. నేను వద్దని చెప్పినా వినకుండా రూ.40 వేలు నా టేబుల్ మీద పెట్టి వెళ్లాడు. ఆ డబ్బులను నేను ముట్టుకోలేదు. నాకు ఏ పాపం తెలియదు.
మూడు నెలలుగా వేధిస్తున్నాడు : కంభం రమేష్, బాధితుడు
2005లో భూమిని కొనుగోలు చేసి ఫంక్షన్‌హాల్ నిర్మించుకున్నాను. అయినప్పటికీ లంచం ఇవ్వకుంటే ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేస్తానని తహసీల్దార్ మూడు నెలలుగా బెదిరిస్తున్నాడు. దీంతో చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాను.