కొంచెం ముందు కుదిరితే బాగుండేది | Assembly election Alliances with other parties in order | Sakshi
Sakshi News home page

కొంచెం ముందు కుదిరితే బాగుండేది

Dec 29 2018 1:34 AM | Updated on Sep 19 2019 8:44 PM

Assembly election Alliances with other parties in order - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే క్రమంలో ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం కొద్దిగా ముందు జరిగి ఉంటే బాగుండేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పొత్తులు కొంచెం త్వరగా కుదిరి కూటమిగా ప్రజల్లోకి వెళ్లి ఉంటే బాగుండేదని, అయినా తాము ప్రచారంలో ఎక్కడా వెనుకబడలేదని చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో పాటు టీవీల్లో విస్తృత ప్రచారం చేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఏఐసీసీకి ప్రాథమిక నివేదిక ఇచ్చామని, పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన వారితో మాట్లాడుతున్నామని తెలిపారు.

రెండు, మూడ్రోజుల్లో ఫలితాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని చెప్పారు. ఈ ఫలితాలెలా ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎల్పీ సమావేశం గురించి ప్రస్తావించగా, ఎప్పుడు నిర్వహించాలనేది ఆలోచిస్తున్నామని చెప్పిన ఆయన.. ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారమే కాలేదు కదా అని వ్యాఖ్యానించారు. కూటమి కొనసాగింపుపై రెండు, మూడ్రోజుల్లో కుంతియాతో చర్చిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.  

సీఈసీ, ఈసీకి ఫిర్యాదు చేస్తాం.
ఎన్నికల్లో తమ ఓటమికి అనేక కారణాలున్నాయని,  ఎన్నికల నిర్వహణపైనే ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని ఉత్తమ్‌ చెప్పారు. ఒక్క శాతం ఓట్ల తేడాతో తమ అభ్యర్థులు ఓడిన ధర్మపురి, కోదాడ, ఇబ్రహీంపట్నంలలో ఎందుకు వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించలేదని ప్రశ్నించారు. అసలు వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కపెట్టడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పోలైన ఓట్లకు, లెక్కింపు ఓట్లకు తేడా ఉందనే విషయాన్ని చెప్పినా కనీసం సమాధానం చెప్పే వాళ్లు లేరని.. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. మంచిర్యాల నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటల తర్వాత వేల సంఖ్యలో ఓట్లు పోల్‌ కావడం ఎలా సాధ్యమన్నారు. వీటన్నింటిపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ), రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి ప్రశ్నించగా తానేమీ మాట్లాడనని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement