‘తారు’లో తిరకాసు! | Asphalt roads Terms of use | Sakshi
Sakshi News home page

‘తారు’లో తిరకాసు!

Jul 12 2015 12:24 AM | Updated on Sep 3 2017 5:19 AM

తారు రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు పంచాయతీరాజ్ విభాగం ఇంజనీరింగ్ అధికారులు కొత్త ఎత్తుగడ

ఖజానాకు చిల్లుపెట్టేందుకు అధికారుల వ్యూహం
కాంట్రాక్టర్లకు రూ.33 కోట్లు దోచిపెట్టేందుకు ఎత్తుగడ
రోడ్ల నిర్మాణంలో స్టోన్‌డస్ట్‌కు బదులు సిమెంట్ కలపాలని నిబంధన
కమీషన్ల దందా పెంచుకునేందుకేనని వెల్లువెత్తుతున్న ఆరోపణలు

 
హైదరాబాద్: తారు రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు పంచాయతీరాజ్ విభాగం ఇంజనీరింగ్ అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు! గతంలో ఎన్నడూ లేని విధంగా నిబంధనల్లో సరికొత్త మెలిక పెట్టారు. బీటీ తయారీలో స్టోన్ డస్ట్‌కు బదులు సిమెంట్ కలపాలంటూ పేర్కొన్నారు. తద్వారా రాష్ట్ర సర్కారుపై రూ. 33 కోట్ల అదనపు భారం మోపారు. ఆర్ అండ్ బీ రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లు సైతం పంచాయతీరాజ్ రోడ్లు చేపట్టేందుకు క్యూ కడుతున్న తీరు చూస్తే ఈ తారు తిరకాసులో ఏం జరిగిందో తేలిపోతుంది. కమీషన్ల దందా పెంచుకునేందుకే అధికారులు ఈ జిమ్మిక్కులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 గతంలో ఎన్నడూ లేని నిబంధన...
 ఎంఆర్‌ఆర్ గ్రాంటు నిధులతో రాష్ట్రంలో 12,006 కిలోమీటర్ల రోడ్డు పనులకు ప్రభుత్వం గతేడాది నవంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు రూ.1,766.92 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే బీటీ రోడ్లకు సంబంధించి పాటించాల్సిన నిబంధనల తయారీ డేటాలో ఇంజనీరింగ్ అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు శాతం సిమెంట్‌ను జత చేయాలని పేర్కొన్నారు. సాధారణంగా బీటీ మిశ్రమంలో రెండు శాతం స్టోన్ డస్ట్‌ను కలుపుతారు. రాష్ట్రంలోని బీటీ ప్లాంట్లన్నింటా ఇదే తీరుగా బీటీ మిశ్రమం తయారవుతోంది. ఆర్ అండ్ బీతోపాటు గతంలో పంచాయతీరాజ్ రోడ్లన్నింటా ఇదే నిబంధన అమల్లో ఉంది. రూ.2,500 ఖర్చయ్యే డస్ట్ బదులుగా రూ.30 వేల విలువయ్యే సిమెంట్ ధరతో అదనపు భారం పెరిగిపోయింది. కానీ సిమెంట్ మిశ్రమంతో ఈ ఖర్చు ప్రతి కిలోమీటరుకు దాదాపు రూ.27,500 చొప్పున పెరిగిపోతుంది. రాష్ట్రంలో మండలాలవారీగా అనుమతించిన ప్యాకేజీ పనులను లెక్కగగితే... దాదాపు రూ.33 కోట్ల అంచనా వ్యయం పెరిగిపోతోంది. అంతమేరకు సర్కారుకు కుచ్చుటోపీ పెట్టినట్లేనని స్పష్టమవుతోంది.

 నాణ్యత అంతంతే...
 బీటీలో స్టోన్ డస్ట్‌ను కలిపినా సిమెంట్ కలిపినా నాణ్యత విషయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన రోడ్డు పనుల్లో సిమెంట్ ఉపయోగించిన దాఖలాలు లేవు. మరోవైపు పనులు జరిగాక బీటీ మిశ్రమంలో సిమెంట్ కలిపారా, డస్ట్ కలిపారా అనేది గుర్తించటం అసాధ్యమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అనుచిత నిబంధనలతో అంచనా వ్యయాన్ని పెంచినందుకు ప్రతి కాంట్రాక్టరు నుంచి అంతమేరకు కమీషన్లు పెంచుకోవాలనేది ఇంజనీరింగ్ అధికారుల ఎత్తుగడగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక అధికారి కింది స్థాయి ఉద్యోగుల నుంచి డివిజన్‌కు రూ. 2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు గుప్పుమంటోంది. వీటితోపాటు సీఆర్‌ఆర్ నిధులతో మంజూరైన పనులకు సైతం డివి  జన్లవారీగా వసూళ్ల పర్వం జోరందుకుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement