ఇచ్చుకో..తోలుకో

Ash Smuggling In Kothagudem - Sakshi

ఉచితం మరిచి ప్రైవేట్‌ వ్యక్తుల పెత్తనం

లారీకి రూ.2 వేల వరకు దండుకుంటున్న వైనం

కేటీపీఎస్‌ అధికారుల పట్టింపు కరువు

పాల్వంచ: కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ (కేటీపీఎస్‌)లో విద్యుత్‌ ఉత్పత్తి చేసే క్రమంలో బొగ్గును మండించడం ద్వారా నిత్యం విడుదలయ్యే బూడిద(యాష్‌)ను ఉచితంగా అందజేయాల్సి ఉండగా..కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు దందా చేస్తున్నారు. లారీ లోడుకింత అని బేరాలు పెట్టి దండుకుంటున్నారు. పాల్వంచ సమీపంలోని పుల్లాయిగూడెం, సూరారం తదితర ప్రాంతాల్లోరెండు యాష్‌పాండ్లు(బూడిద చెరువులు) ఉండగా..కాలుష్య ఉద్ఘారకం కాబట్టి దీని సాంద్రతను తగ్గించుకునేందుకు జెన్‌కో యాజమాన్యం ఉచితంగా తీసుకెళ్లే అవకాశం కల్పించింది.

సిమెంట్‌ బ్రిక్స్‌ తయారీకి, సిమెంట్‌ కంపెనీలకు, ఫిల్లింగ్‌ చేసేందుకు, మరే ఇతర అవసరాలకైనా దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా అందజేస్తారు. దీంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చి బూడిదను యాష్‌ లారీల ద్వారా నిత్యం తీసుకెళుతుంటారు. స్థానికంగా కొందరు ప్రైవేట్‌ వ్యక్తుల జోక్యంతో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక..లారీల ద్వారా నిత్యం తరలించే బూడిదకు రూ.వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. రవాణా చేసే క్రమంలో చాలామంది లోడుపై పట్టాలను పూర్తిగా కప్పకపోవడంతో..టార్బల్‌ కట్టకపోవడంతో రహదారిపై బూడిద కారుతూ, వెనకాల వచ్చే వాహనదారులు అవస్థ పడుతున్నారు. ఇలాంటి వాహనాలను ఆపి స్థానికులు ఘర్షణలు పడిన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. 

వారికి ఇది వ్యాపారం..
యాష్‌ పాండ్ల నుంచి బూడిదను తీసుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు జెన్‌కో యాజమాన్యం నుంచి అనుమతి తీసుకుని, లారీల ద్వారా కొంతకా>లంగా తీసుకెళుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, వరంగల్‌ తదితర జిల్లాలకు అధికంగా ఈ బూడిదను తరలిస్తున్నారు. కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు ఒక్కోలారీ బుడిదకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా అక్రమంగా వేలాది రుపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. అనుమతి తీసుకున్న వారు కర్మాగారంపై అవగాహన లేని వ్యక్తులకు అమ్ముకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

నిఘా పెడతాం..
బూడిదను తీసుకెళ్లేందుకు కొందరు దరఖాస్తు చేసుకుంటే యాజమాన్యం అనుమతినిచ్చింది. ఈ విషయంలో మా ప్రమేయం ఏమీ లేదు. అనుమతి తీసుకున్న వారు అమ్ముకుంటున్నట్లు ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. దీనిపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. బూడిదను ఎవరు అడిగినా ఉచితంగా అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.– టీఎస్‌ఎన్‌.మూర్తి, సీఈ, కేటీపీఎస్‌ 5,6 దశలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top