ఇక ఎత్తిపోసుడే

Arrival of Krishna waters today to Jurala - Sakshi

జూరాలకు నేడు కృష్ణా జలాల రాక

గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణపై సీఎం సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు మంగళవారం ఉదయానికి జూరాల చేరనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జూరాలకు వచ్చే నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంది. జూరాల నిర్ణీత మట్టాలకు నిల్వ చేరిన వెంటనే నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ పంపులను ప్రారంభించి కృష్ణా జలాల ఎత్తిపోతలను చేపట్టనుంది. గతేడాది 50 టీఎంసీల మేర నీటిని జూరాలపై ఆధారపడిన ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు తరలించగా ఈ ఏడాది అంతకుమించి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 

ఎగువ నుంచి రాగానే ఎత్తిపోత 
పశ్చిమ కనమల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరిగిన విషయం తెలిసిందే. సోమవారం సైతం ఆల్మట్టిలోకి లక్ష క్యూసెక్కుల మేర వరద వస్తుండగా అంతే మొత్తం నీటిని దిగువ నారాయణపూర్‌కు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టిలో ప్రస్తుతం 129 టీఎంసీలకుగాను 123 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఇక నారాయణపూర్‌లో సైతం 37 టీఎంసీలకుగాను 32 టీఎంసీల నిల్వ ఉండగా అందులోంచి 18 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలారు. ఈ నీరు జూరాల వైపు వస్తోంది. సోమవారం మధ్యాహ్నమే జూరాలకు ముందున్న కర్ణాటకలోని గూగల్‌ బ్యారేజీని కృష్ణా వరద దాటగా మంగళవారం ఉదయానికి జూరాలను చేరుకోనుంది. జూరాలలో ప్రస్తుతం 9.66 టీఎంసీలకుగాను 1.99 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఇందులో మరో 5 టీఎంసీల నీరు చేరిన వెంటనే భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పంపులు ప్రారంభం కానున్నాయి. దీంతోపాటే జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగనుంది.

చర్యలు చేపట్టండి: కేసీఆర్‌ 
గోదావరి పరిధిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతోపాటు కడెం, ఎల్లంపల్లిలో వరద మొదలైనందున వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వరద నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంజనీర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో వరద పరిస్థితిపై కేసీఆర్‌ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కడెంకు చేరుకుంటున్న వరదతో ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లికి వరద చేరుకునే అవకాశం ఉండటంతో గోలివాడ వద్ద ఉన్న పంపుల్లో ఎన్ని మోటార్లను నడిపిస్తారో పరిశీలించి నీటిని ఎత్తిపోయాలన్నారు. అలాగే కృష్ణా బేసిన్‌లో భారీ వరదలు వస్తున్నందున దానిపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ద్వారా గరిష్ట నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. శ్రీశైలానికి వరద చేరిన వెంటనే కల్వకుర్తి పంపులను సైతం నడిపించి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నారు. దీంతోపాటే ప్రతి బ్యారేజీ వద్ద గేట్ల నిర్వహణ, పంపులు మోటార్ల మరమ్మతు పనులు ఉంటే తక్షణమే చేసుకొని ఇంజనీర్లు ఆయా ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎంవో స్మితా సబర్వాల్, ఓఎస్‌డీ శ్రీపతి దేశ్‌పాండే, ఈఎన్‌సీ మురళీధర్‌ తదితరులు హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top